విలీన పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎపీటీఎఫ్ నాయకురాలు మంజుల
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విలీన పాఠశాలల సమస్యలపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని డీఈవోని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆ సంఘం స్థానిక కార్యాలయంలో సబ్ కమిటీ, రాష్ట్ర కౌన్సిలర్ల సంయుక్త సమావేశం ఆదివారం నిర్వహించారు. ఎస్.గురునాథశర్మ అధ్యక్షత వహించారు. తొలుత జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘుబాబు మాట్లాడుతూ.. సుమారు 250 ఉన్నత పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతులను విలీనం చేశాక తరగతి గదులు, ఉపాధ్యాయులు సరిపోక బోధన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి సమస్య తీర్చాలని కోరారు. ముఖ్యఅతిథి సీహెచ్.మంజుల మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను సంతృప్తి పరిచేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరిలో శ్రీకాకుళంలో నిర్వహించే ఏపీటీఎఫ్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి విజయసారథి కోరారు. సమావేశంలో టి.సుబ్బారావు, శేఖర్‌బాబు, కలాం, యోహాన్రెడ్డి, నాయబ్‌రసూల్, మరియదాసు, బి.శేషారావు తదితరులు పాల్గొన్నారు.