logo
Published : 29 Nov 2021 04:53 IST

బతుకుల్లో అలకల్లోలం...

తరచూ నిలుస్తున్న చేపల వేట

పూట గడవక మత్స్యకారుల అవస్థ

తీరం వెంట నిలిపి ఉంచిన మర పడవలు

చీరాల, న్యూస్‌టుడే: సముద్రం ప్రశాంతంగా ఉంటేనే వేటకు వెళ్లగలిగేది. మత్స్యకారుల జీవనం సాగేది. లేదంటే అవస్థలు తప్పవు. ఇటీవల వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాలు, తుపాన్ల ప్రభావం మత్య్సకారుల జీవితాలను కల్లోలంలో పడేస్తున్నాయి. నెల రోజులకు పైగా వేట సాగకపోవడంతో.. గంగపుత్రులు అప్పులతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో 102 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. వాడరేవు, కొత్తపట్నం, పాకల, రామాయపట్నం వంటి ప్రధాన తీరాలతో పాటు మొత్తం 74 వరకు మత్స్యకార గ్రామాలున్నాయి. వేట ప్రధాన వృత్తితో పాటు అనుబంధంగా దాదాపు 20 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

తలకిందులైన ఆశలు..: సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌ మాసాలు వేటకు అనుకూలం. ఈ సమయంలో చేపలు బాగా లభిస్తాయి. మిగిలిన కాలం నామమాత్రంగా వేట సాగినప్పటికీ.. ఈ కాలంలో లభించే మత్స్య సంపదతో జాలర్ల ఇబ్బందులు తీరుతాయి. గత సంవత్సరం కరోనా నేపథ్యంలో వేట ఆశాజనకంగా లేకపోయింది. దీంతో ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రకృతి ప్రకోపించడంతో అవన్నీ తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది.

ధరలు తగ్గి... ఖర్చులు పెరిగి..: ఈ సీజన్‌లో మత్య్సకారులకు ఇతర కష్టాలు కూడా తోడయ్యాయి. గతంతో పోలిస్తే మత్స్యసంపద తక్కువగా లభిస్తోంది. జిల్లాలోని తీర ప్రాంతంలో హేచరీలతో పాటు, రొయ్యల చెరువులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు పెరిగి పోయాయి. వాటి వ్యర్థాలను సముద్రంలోకి వదులుతుండటంతో మత్స్యసంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనికితోడు లభించిన చేపలకు తగిన ధరలు ఉండటం లేదు. గత సీజన్‌లో రొయ్య శంఖు రకం కిలో రూ.150 ఉండగా.. ప్రస్తుతం రూ.100కి పడిపోయింది. కలంద రూ.250 ఉండగా.. ఇప్పుడు రూ. 180 లభిస్తోంది. మరోవైపు ఇంధనంతో పాటు ఇతర ఖర్చులు మాత్రం రెట్టింపయ్యాయి. ప్రతికూల వాతావరణం.. అననుకూల పరిస్థితులు గంగపుత్రులను కష్టాలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని