logo
Updated : 29 Nov 2021 11:05 IST

రానున్న 48 గంటలపాటు...

పొంచి ఉన్న ముప్పు

కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంల ఏర్పాటు

పంట దిగుబడులపై కర్షకుల దిగులు

చీరాల మసీదు సెంటర్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: అల్ప పీడనం ప్రభావం దృష్ట్యా రానున్న 48 గంటలపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. తీరప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, టంగుటూరు, జరుగుమల్లి, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరులో ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు, లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. ఆ దిశగా సహాయక చర్యలు చేపట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అప్రమత్తం చేశారు.

మొదలైన వర్షాలు...: నెల్లూరు జిల్లా సరిహద్దులోని గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం తదితర మండలాల్లో శనివారం రాత్రి నుంచే మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో ఆదివారం ఉదయం నుంచే వర్షాలు పడుతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను కందుకూరు ఇన్‌ఛార్జి ఆర్డీవో గ్లోరియా పరిశీలించి అక్కడి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. నీటి ప్రవాహం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నదాతల్లో ఆందోళన...: ఈ నెలలోనే రెండు విడతలగా భారీ వర్షాలు కురిశాయి. మరోసారి పడనున్నట్టు హెచ్చరికలు జారీ కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు కురిసిన వర్షాలకు సగం విస్తీర్ణానికి పైగా పొగాకు, శనగ, మిరప, మినుము, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక భారీ వర్షం పడితే పంటలు చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగ నారుమళ్లు దెబ్బతినడంతో పాటు, తెగుళ్ల ఉద్ధృతి ఇప్పటికే ఎక్కువగా ఉంది.

లోతట్టు ప్రాంతాలపై దృష్టి...: తీరప్రాంత గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలపై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న పునరావాస కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల వంటి సురక్షిత కేంద్రాలకు తరలించేందుకు ప్రణాళిక చేశారు. బియ్యం, కందిపప్పు, పంచదారను ఆయా ప్రాంతాల్లోని చౌకధరల దుకాణాల వద్ద సిద్ధం చేశారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పెనుగాలుల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా విద్యుత్తు శాఖ చర్యలు చేపట్టింది. రహదారులు దెబ్బతినడంతో పాటు, భారీ వృక్షాలు కూలిన సమయంలో సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా తక్షణమే పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేశారు.

తుపాను నష్ట నివారణ, సహాయక చర్యలపై ఒంగోలులోని కలెక్టరేట్‌తో పాటు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం నం:08592- 281400; టోల్‌ ఫ్రీ నంబరు:1077ను అందుబాటులో ఉంచారు. డివిజనల్‌ స్థాయిలో కందుకూరు ఉప కలెక్టర్‌ కార్యాలయంలో 08598-223235; ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో 88866 16044; మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో 91103 93042ను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలు భారీ వర్షాలకు ఏదైనా సమస్య ఉంటే ఆయా ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించి సహాయం పొందవచ్చని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు.

పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధం..

ఒంగోలు నేరవిభాగం, న్షూస్‌టుడే: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలకు కొన్ని సూచనలు చేశారు...

వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. సముద్రతీరం వెంట నివసిస్తున్న ప్రజలు పోలీసు, రెవెన్యూ అధికారుల సూచనలు అనుసరించి తుపాను షెల్టర్‌లో తలదాచుకోవాలి. ● చెరువులు, కాలువలకు గండి పడే అవకాశాలున్నచోట్లతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టు ప్రాంతాల్లో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షించాలి. ● ఈదురుగాలులకు చెట్లు విరిగి పడిపోయే ప్రమాదం ఉన్నందున ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలపై పోలీసులు దృష్టి సారించాలి. ● నీట మునిగిన రహదారులు, ప్రయాణాలకు అనువుగా లేని మార్గాలను మూసివేసి పికెట్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర సాయం కోసం డయల్‌-100కు ఫోన్‌ చేయాలని, 9121102266 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు...  

చీరాల గ్రామీణం: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని డీపీవో నారాయణరెడ్డి సూచించారు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరాన్ని ఆయన ఆదివారం పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం పనులు చురుగ్గా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

నేడు  స్పందన రద్దు...  

ఒంగోలు గ్రామీణం: అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న స్పందన, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలను రద్దు చేసినట్టు కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు రావద్దని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

రాళ్లపాడు వద్ద అప్రమత్తం

కొత్త స్పిల్‌వేలోని రెండు గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న వరద నీరు

లింగసముద్రం, న్యూస్‌టుడే: రాళ్లపాడు జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో.. కొత్త స్పిల్‌వేలోని రెండు గేట్లను ఎత్తి మన్నేరుకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3200 క్యూసెక్కులు వస్తోంది. దీంతో 20 అడుగుల వద్ద నీటిని స్థిరీకరించి 5200 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో మన్నేరు, ఉప్పుటేరు పరీవాహక ప్రాంతాలైన పెదపవని, అన్నేబోయినపల్లి, అంగిరేకులపాడు, చీమలపెంట, రాళ్లపాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ బ్రహ్మయ్య సూచించారు.

గుడ్లూరులో 104.2 మి.మీ వర్షపాతం...

గుడ్లూరులో ఉద్ధృతంగా ఉప్పుటేరు ప్రవాహం

ఒంగోలు గ్రామీణం: శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి అత్యధికంగా గుడ్లూరులో 104.2 మి.మీ వర్షపాతం నమోదైంది. లింగసముద్రం 67.2 మి.మీ; కందుకూరు(35.6); చీరాల(46.8); కొత్తపట్నం(42.0); జరుగుమల్లి(37.2); టంగుటూరు(27.6); కారంచేడు(26.2); ఉలవపాడు(49.6); సింగరాయకొండ(34.6); వలేటివారిపాలెం 35.2 మి.మీ నమోదైంది. అలాగే నాగులుప్పలపాడు 19.4 మి.మీ; పొన్నలూరు(18.4); ఇంకొల్లు(18.6); చినగంజాం(17.0); అద్దంకి(17.0); పీసీపల్లి, కొండపి(16.8); ఒంగోలు(15.6); చీమకుర్తి, కొరిశపాడు 15.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని