logo
Published : 02/12/2021 05:36 IST

కళ్లెదుట ఇళ్లు.. వెళ్లలేరు వాళ్లు

 ‘టిడ్కో’ ఆధ్వర్యంలో నిర్మించిన వాటి పరిస్థితి

 ఈ నెలలో లబ్ధిదారులకు పంపిణీ లేనట్లే

 

కందుకూరులో నిర్మాణం పూర్తయిన టిడ్కో గృహాలు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: పట్టణ ప్రాంతాల్లోని పేదలకు అత్యాధునిక వసతులతో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో(పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ) గృహాల పంపిణీ జిల్లాలో ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. పట్టణాల్లో అధిక అద్దెలు భరించలేక కలల సౌధంలోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఏళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. దాదాపు 9,568 గృహాలు వీరికి అందాల్సి ఉంది.

గత ప్రభుత్వం 11,968 ఇళ్లు మంజూరుచేసింది. నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు అర్ధంతంగా ఆగిపోయాయి. వాటినే నమ్ముకున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పులు చేసి కిరాయి ఇళ్లలో యాతన అనుభవిస్తున్నారు. ఈక్రమంలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను పరిగణలోకి తీసుకొన్న ప్రభుత్వం 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ఇళ్లను రద్దుచేసింది. దీంతో మిగిలిన 9,568 నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో కందుకూరులో 100 శాతం పనులు పూర్తయ్యాయి. ఒంగోలుతో పాటు మిగిలిన అన్ని పట్టణాల్లో 60 నుంచి 70 శాతం పూర్తయినట్లు టిడ్కో అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వాటిని 8 నెలల్లోనే పూర్తిచేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. కొన్నింటిని పూర్తిచేసే బాధ్యతను రివర్స్‌ టెండరింగ్‌లో వేరే కంపెనీలకు అప్పగించినా వేగం పెరగలేదు. దీంతో జిల్లాలో చాలావరకు నిరుపయోగంగా ఉండగా, సామగ్రి శిథిలావస్థకు చేరింది. పూర్తయిన గృహాలను తొలి విడతగా ఈనెల 15 నుంచి 25 వ తేదీవరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీరా జిల్లాలో వందశాతం పూర్తికాకపోవడంతో బ్రేకు పడింది.

ఆలస్యానికి కారణాలెన్నెన్నో..

టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని రివర్స్‌ టెండరింగ్‌లో పలు సంస్థలు చేపట్టాయి. కొన్నింటిని పూర్తిచేసే బాధ్యతను మళ్లీ ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. అయితే పాత బిల్లుల చెల్లింపు వ్యవహారం, ఇతర అంశాల నేపథ్యంలో పనులు జరగడంలేదు. కందుకూరులో వందశాతం పనులు పూర్తిచేసినా రోడ్లు వేయలేదు. మిగిలిన అన్నిచోట్ల కాంక్రీట్‌ పనులు మినహా తలుపులు, కిటికీలు, పైపలు అమర్చాలి. మురుగునీటి వ్యవస్థ, అంతర్గత సిమెంట్‌రోడ్లు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాక ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

కనిగిరిలో ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు

 

వచ్చే జులైలో పంపిణీ

కందుకూరులో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఒంగోలు, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది జూలైలో కొన్ని, డిసెంబరులో మిగిలినవి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం.

-వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజినీర్‌, టిడ్కో

మొత్తం మంజూరైన గృహాలు: 11,968

ఎక్కడెక్కడ: ఒంగోలు, అద్దంకి, కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం

రద్దయిన ఇళ్లు: 2400

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని