logo
Published : 03/12/2021 05:30 IST

పగుళ్లతో కలకలం

 మోపాడు జలాశయం వద్ద ఆగని లీకులు  
 అర్ధరాత్రి వేళ వణుకు


భయంతో వీధుల్లోకి వచ్చిన మోపాడు గ్రామస్థులు 

పామూరు మండలం మోపాడు జలాశయం కట్టకు ఆరుచోట్ల ఏర్పడ్డ లీకేజీల నివారణ పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ట్రాక్టర్లతో మట్టిని తోలించి కట్ట లోపల, బయట వేయడమేగాక లీకుల వద్ద ఇసుక, కంకర, సిమెంట్, మట్టి బస్తాలతో పూడుస్తున్నారు. అయినా లీకులు ఆగడంలేదు. గురువారం అర్ధరాత్రి సైతం కట్ట పక్కనే కొత్తగా పగుళ్లు రావడంతో సమీప గ్రామాల్లో ఆందోళన నెలకొంది. - న్యూస్‌టుడే: పామూరు, కనిగిరి

జలాశయంలో 30.2 అడుగులకు పైగా నీటిమట్టం ఉండడంతో నీటిపారుదల శాఖ అధికారులు అలుగు వద్ద కొంత భాగం పగులగొట్టి బయటకు పంపేలా చేశారు. దీంతో గురువారం 29 అడుగులకు జలం తగ్గింది. మరోవైపు విజయవాడ నుంచి వచ్చిన డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నిపుణులు  శ్రీనివాస్‌ పరిశీలించి కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. బురద రంగుతో కూడిన ఊట వస్తే గండిపడే అవకాశం ఉంటుంది తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదన్నారు. అయితే గురువారం అర్ధరాత్రి లీకుల నివారణ పనులు చేసిన ప్రాంతం పక్కనే పగుళ్లు రావడంతో ఆందోళన నెలకొంది. వెంటనే కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్, డీఎస్పీ కె.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఉష చేరుకున్నారు. కట్ట భాగాన్ని పరిశీలించారు. అలుగు దగ్గర మరింత లోతుగా తవ్వించి ప్రవాహం వాగులోకి మరలేలా పనులు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించి బందోబస్తు ఏర్పాటుచేశారు. 


గురువారం అర్ధరాత్రి జలాశయం వద్ద పనులు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ కె. శ్రీనివాసరావు, అధికారులు 

గ్రామస్థుల పహారా
కనిగిరి, న్యూస్‌టుడే: మోపాడు రిజర్వాయర్‌కు లీకులు ఏర్పడి గురువారం రాత్రి వరకు అదేవిధంగా నీరు పోతుండటంతో మోపాడు గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. పునరావాస కేంద్రానికి వెళ్లిన కొందరు తిరిగి గురువారం రాత్రి ఇళ్లకు చేరుకోగా వారిని పోలీసులు కలిశారు. మళ్లీ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. పోలీసులతోపాటు కొందరు గ్రామస్థులు పహారా కాయడం కనిపించింది. మాజీ జడ్పీటీసీ మోరుబోయిన హుస్సేన్‌రావు, తెదేపా గ్రామకమిటీ అధ్యక్షుడు గిడ్డయ్య, రాహుల్‌ స్థానికులకు ధైర్యం చెబుతూ ఎప్పటికప్పుడు కట్ట పరిస్థితుల గురించి వివరించారు.


అలుగు వద్ద పరిస్థితి 


ఇంకెప్పుడు పటిష్ఠత?


లీకవుతున్న చోట్ల భారీగా వేసిన ఇసుక, కంకర బస్తాలు 


కనిగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో అతి పెద్ద జలాశయాల్లో మోపాడు ఒకటి. 29 అడుగుల సామర్థ్యం, 2.1 టీఎంసీల నీటి నిల్వ దీని సొంతం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 20 వేల ఎకరాల ఆయకట్టుకు భరోసా ఇచ్చే దీనిని 1902లో బ్రిటీష్‌ పాలకులు నిర్మించారు. ఆది నుంచి నిర్వహణ పరంగా అలక్ష్యం కనిపిస్తూనే ఉంది. 1996లో వరద ఉద్ధృతికి ఆనకట్ట తెగి 100 మంది వరకు మృతిచెందినా మళ్లీ అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ఠ చర్యలు లేవు. ముందే మేల్కొని ఇక్కడ పనులు చేసుంటే తాజాగా ఏర్పడ్డ సమస్య నెలకొని ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జలాశయంలో గత కొన్నేళ్లుగా సామర్థ్యం కంటే తక్కువే నీరుండేది. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు స్వరూపమే మారిపోయి ప్రమాదకర స్థితికి చేరింది. మరో అడుగు అధికంగా నీరు చేరి కట్టకు అయిదారుచోట్ల లీకేజీలు ఏర్పడ్డా ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. గతంలో కట్ట గట్టితనానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అటు యంత్రాంగం, ఇటు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సి వచ్చింది. రెండు రోజులుగా రేయింబవళ్లు నీటిపారుదల శాఖ, నిపుణులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఆశాజనకంగా లేదు. 

లోపాలే శాపాలు
రిజర్వాయర్‌ గర్భంలో పూర్తిగా చిల్ల చెట్లు మొలిచి ప్రమాదకరంగా మారాయి. ఆనకట్ట సైతం శిధిలావస్థకు చేరి నిండితే తెగిపోయే స్థితిలో ఉంది. గత ఏడాది రిజర్వాయర్, కాల్వలు, ఆనకట్ట, సీసీ కాల్వల పనులకు  రూ.31 కోట్ల జైకో నిధులు మంజూరయ్యాయి. కట్ట బలహీనంగా ఉన్నచోట తొలుత పనులు చేపట్టకుండా సీసీ, బ్రాంచి కాల్వల నిర్మాణం చేపట్టారు. నెల రోజులుగా తరచూ వర్షాలు పడుతుండటంతో గుత్తేదారుడు పనులు నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా పై ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహానికి నీటిమట్టం పెరిగిపోయి లీకులు ఏర్పడ్డాయి డీఈ రవి స్పందిస్తు ప్రస్తుతం వివిధ పనులకు రూ.31 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కాల్వ పనులు చేపడుతున్నామన్నారు. అనుకోకుండా వచ్చిన వరదల వల్ల రిజర్వాయర్‌ నిండి లీకులు ఏర్పడ్డాయని తెలిపారు. నీటి సామర్థ్యాన్ని తగ్గించి కట్ట బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు.  

కలెక్టర్, ఎస్పీ సందర్శన
పామూరు: మోపాడు జలాశయాన్ని గురువారం మధ్యాహ్నం కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికా గార్గ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆనకట్ట లీకుల నివారణకు యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తూ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కటను దృఢం చేసేలా, నీటిమట్టాన్ని తగ్గించేలా తగిన ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని ఆదేశించారు. ఎస్పీ మలికా గార్గ్‌ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ లక్ష్మారెడ్డి, డ్వామా పీడీ కె.శీనారెడ్డి, డీఈఈ బి.రవి, ఎంపీపీ జి.లక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు.  
* లక్ష్మీనరసాపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మోపాడు గ్రామానికి చెందిన 206 మంది ఉంటున్నారు. ఈ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పరిశీలించి వారితో మాట్లాడారు.   


అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని