logo
Published : 04/12/2021 05:51 IST

కాపాడే భవనాలే కూలేలా!

 శిథిలావస్థలో తుపాను రక్షిత షెల్టర్లు


చినగంజాం మండలం రామచంద్రానగర్‌లో పాడైన తుపాను రక్షిత భవనం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:  జిల్లాలో కోస్తా తీరప్రాంతం 11 మండలాల పరిధిలో చీరాల మండలం విజయలక్ష్మీపురం నుంచి గుడ్లూరు మండలం మొండివారిపాలెం వరకు 102 కి.మీ మేర విస్తరించి ఉంది. చేపల వేట ఆధారంగా జీవనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎక్కువ. తీరాన్ని నమ్ముకుని ఆయా పల్లెల్లో లక్షలాది మంది జీవిస్తున్నారు. ప్రకృతి, విపత్తుల వేళ ప్రాణనష్టం సంభవించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 88 రక్షిత భవనాలు నిర్మించారు. ఇవన్నీ ఒకప్పుడు మెరుగైన సేవలందించినా ప్రస్తుతం నిర్వహణ లేక దయనీయంగా మారాయి. భారీ తుపాను వస్తే ఏమిటన్న ప్రశ్నకు యంత్రాంగమే సమాధానం చెప్పాలి. అన్ని సదుపాయాలతో కొత్తగా కేవలం 10 మాత్రమే నిర్మించారు. అందుకు ఒక్కో భవనానికి గత ప్రభుత్వ హయాంలో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. 
పెచ్చులూడి.. బీటలు వారి
భవనాలు నిర్మించి దశాబ్దాల కాలం కావడంతో శ్లాబులు పెచ్చులూడుతున్నాయి. గోడలు బీటలు వారాయి. బలమైన గాలుల తాకిడి కారణంగా తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. బాధితులను రక్షించాల్సిన భవనాలే ప్రమాదకరంగా మారాయి. చాలా చోట్ల పశుశాలలగా మార్చేశారు. కొన్ని కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి. ఏటా సెప్టెంబర్‌-ఫిబ్రవరి మధ్యలో తుపాన్లు సంభవిస్తుంటాయి. ఏ విపత్తు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అల్పపీడనం ఏర్పడి బలపడిన సమయంలో అప్పుడు హడావుడిగా ప్రకటనలు, బాధితుల తరలింపులో అధికారులు నిమగ్నమవుతున్నారు. 

ఇలా చేస్తే మేలు..
* తుపాన్లు వచ్చినప్పుడే రెవెన్యూ, పంచాయతీరాజ్‌ యంత్రాంగం వీటి వైపు చూస్తోంది. నిత్యం వీటిపై పర్యవేక్షణ ఉండాలి. 
* అన్ని వసతులతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు వినియోగించేలా చూడాలి. సభలు, సమావేశాలు, వేడుకలు, శుభకార్యాలకు ఇవ్వాలి. తద్వారా భవన నిర్వహణకు ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంది. 
* విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది నియామకం చేపట్టాలి. 
* ఏటా వర్షాకాలం ముందే వాటి పరిస్థితిపై అధికారులు పర్యవేక్షించాలి. సమస్యలు పరిష్కరించాలి.  

చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధి రామచంద్రానగర్‌లో సుమారు 1000 మంది నివాసముంటారు. స్థానికులను దృష్టిలో ఉంచుకుని 30 సంవత్సరాల కితం తుపాను రక్షిత భవనం నిర్మించారు. అది పాడై నిరుపయోగంగా మారింది. విపత్తు పరిస్థితుల్లో ఏదైనా పునరావస కేంద్రానికి తరలించాలన్నా స్థానిక ప్రాథమిక పాఠశాలలో సరిపడా వసతులు లేవు. దీంతో ఒకటిన్నర కిలో మీటరు దూరంలో ఉన్న చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని