‘భాజపాతో పేదలకు ఇబ్బందులు’
ప్రసంగిస్తున్న సీపీఎం నేత వెంకటేశ్వరరావు
మార్కాపురం గ్రామీణం, న్యూస్టుడే: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో దేశవ్యాప్తంగా ప్రమాదం పొంచి ఉందని, వచ్చే ఎన్నికల్లో అడ్డుకోకపోతే పేద ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడతారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అన్నారు. సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా 13వ మహాసభలు ముగింపు కార్యక్రమాన్ని స్థానిక ఎస్వీకేపీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే హక్కును కూడా ప్రధాని మోదీ హరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎవరిపై కేసులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. జిల్లాలోని వెలిగొండపై నాయకులకు చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. నాయకులు ఎం.ఎ.గఫూర్, జాలా అంజయ్య, కె.ఉమా మహేశ్వరరావు, సయ్యద్ హనీఫ్, గాలి వెంకట రామిరెడ్డి, ఊసా రాజ్యలక్ష్మి, వెల్లంపల్లి ఆంజనేయులు, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.