logo

Crime News: తల్లీకుమార్తెల జంట హత్యల వెనుక ఆ ముఠా?

టంగుటూరులో హత్యకు గురైన తల్లీకూతుళ్ల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. నలుగురు సభ్యుల ముఠాను మహారాష్ట్రలోని షోలాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హతులు జలదంకి శ్రీదేవి(43), వెంకట లేఖన(21)ల ఒంటిపై ఉన్న సుమారు 20 సవర్ల బంగారు ఆభరణాలను

Updated : 05 Dec 2021 10:44 IST

 షోలాపూర్‌లో అనుమానితుల పట్టివేత 
 తరలివెళ్లిన పోలీసులు


టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌ ఇది. ఇక్కడికి వంద మీటర్ల దూరాన (వృత్తంలో) ఉన్న ఈ భవనం పక్కనే హత్యలు జరిగాయి. 

ఒంగోలు నేరవిభాగం, సింగరాయకొండ గ్రామీణం. న్యూస్‌టుడే:  టంగుటూరులో హత్యకు గురైన తల్లీకూతుళ్ల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. నలుగురు సభ్యుల ముఠాను మహారాష్ట్రలోని షోలాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హతులు జలదంకి శ్రీదేవి(43), వెంకట లేఖన(21)ల ఒంటిపై ఉన్న సుమారు 20 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకు వెళ్లారు. ఇదే తరహాలో నవంబర్‌ 19వ తేదీ అర్ధరాత్రి ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. వృద్ధురాలి చెవిని కోసేసి మరీ బంగారు కమ్మలను లాక్కున్నట్లు గుర్తించారు. ఈ వరుస హత్యల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు గుర్తించారు. దోపిడీ దొంగలు టంగుటూరు టోల్‌ప్లాజా, ఒంగోలు, అద్దంకి మీదుగా హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించారు. దీంతో పోలీసులు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. నలుగురిని షోలాపూర్‌ వద్ద పట్టుకున్నారని..వారు టంగుటూరు నుంచే వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిసింది. జిల్లా నుంచి పోలీసు బృందం బయలుదేరింది.. 
నిఘా లేదు.. భద్రతా కానరాదు
టంగుటూరు మండల కేంద్రంలో పోలీసు స్టేషన్, పంచాయతీ కార్యాలయం, దేవాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. అలాంటి రద్దీ ప్రాంతంలో.. అదీ శుక్రవారం రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య తల్లీకుమార్తెల దారుణ హత్యకు గురికావడం స్థానికంగా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. సమీప ప్రాంతాల్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఒక ఆలయం వద్ద ఉన్నా ఎటువంటి దృశ్యాలు నమోదు కాలేదు. కొందరు అనుమానిత వ్యక్తులు రాత్రి 8 గంటల సమయంలో ఆ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 అయినా పట్టించుకోవడం లేదు
ఇక్కడ పోలీసింగ్‌ ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు వాపోయారు. వారి కళ్లముందే మద్యం తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గస్తీ పూర్తిస్థాయిలో ఉండటం లేదని, అర్థరాత్రుళ్లు సైతం కొందరు గుంపులుగా సంచరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని శనివారం ఎస్పీ దృష్టికీ తీసుకెళ్లారు.
 పోస్టుమార్టం పూర్తి
శ్రీదేవి, లేఖన మృతదేహాలకు ఒంగోలు జీజీహెచ్‌లో శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఓఎస్డీ కె.చౌడేశ్వరి టంగుటూరు పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సింగరాయకొండ సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలతో పాటు నేరపరిశోధనలో అనుభవజ్ఞులైన వై.నాగరాజు, కె.కమలాకర్‌ వంటి ఎస్సైలను సైతం రప్పించారు. బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

4 బృందాలతో దర్యాప్తు: ఎస్పీ
జంటహత్యల కేసు దర్యాప్తునకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. వీటిని ఓఎస్డీ కె.చౌడేశ్వరి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. హత్యకు గురికావడానికి ముందు వారితో మాట్లాడిన స్థానిక మహిళల నుంచి వివరాలు రాబట్టారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌లతో నేరస్థలాన్ని తనిఖీ చేయించారు. అన్ని ఆధారాలను సేకరించి భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు గంటలకోసారి పురోగతిపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, ఎస్‌బీ సీఐ కె.వి.రాఘవేంద్ర, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.


జంట హత్యలు జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని