logo

AP News: నన్నెవరూ ఆపలేరు! ఓ అమాత్యుడి అనుచరుడి దందా

పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని...

Updated : 25 Dec 2021 07:21 IST

‘నేను మోనార్క్‌ని.. నన్నెవరూ ఏమీ చేయలేరు’. అంటూ ఆయన సామాన్యులనే కాదు, అధికారులను సైతం బెంబేలెత్తిస్తుంటాడు. ఇటీవల ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఉదంతంలోనూ అతను నిందితుడు. ఒంగోలు భాగ్యనగర్‌లో అతని వ్యవహారం నిత్యం చర్చనీయాంశమే. 20 నుంచి 30 మంది దాకా అక్కడ మద్యం సేవిస్తూనే ఉంటారు. వీరితో స్థానికులు పడే ఆవేదన అంతాఇంతా కాదు.. అసలే రౌడీగ్యాంగ్‌.. ఆ పై రాజకీయ నేపథ్యం ఉన్న ముఠా. దీంతో ఎవరికి వారు చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. ఇదీ అధికార వైకాపాకు చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడి దందా..  

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పర్చూరు నియోజకవర్గం నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వైకాపా నాయకుడు గత కొన్నేళ్లుగా ఓ కీలక ప్రజాప్రతినిధికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అదే ఆసరాగా సొంత ప్రపంచాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ క్రమంలోనే ఒక్క ఒంగోలులోనే మూడు ప్రాంతాల్లో నివాసాలు అద్దెకు తీసుకున్నాడు. ఎవరికీ పైసా అద్దె కట్టడు. అదేమంటే నేత పేరు చెప్పి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భాగ్యనగర్‌లోని ఒక ప్లాట్‌లో అతను ప్రస్తుతం ఉంటున్నాడు. రోజూ అర్ధరాత్రి దాటేవరకు మందు పార్టీలు నడుస్తుంటాయి. ఇంటి యజమానికి కొన్నాళ్లుగా అద్దె చెల్లించడం లేదు. అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో ఆందోళనకు గురైన యజమాని తన ప్లాట్‌కు విద్యుత్తు బిల్లు చెల్లించడం మానేశారు. అధికారులు కనెక్షన్‌ తీసేశారు. ఆగ్రహించిన ఆ నాయకుడు అనధికారికంగా విద్యుత్తు కనెక్షన్‌ తీసుకున్నాడు. ఇది తెలిసి వచ్చిన సిబ్బందిని సైతం హెచ్చరించినట్లు తెలిసింది. నగరంలో మరో రెండు ప్రాంతాల్లోనూ సదరు నాయకుడు ఇదే దందా కొనసాగిస్తున్నాడు. రోజూ సుమారు 20 నుంచి 30 మంది వరకు యువకులకు మద్యం పోయించి బల ప్రదర్శన చేయిస్తుంటాడు. ఇక దందాలు సరేసరి. పోలీసులు అతని వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. పోస్టింగులు సైతం వేయిస్తానంటూ వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అధికార పార్టీకి సంబంధించి ఒంగోలులో జరిగిన ఓ సంచలన సంఘటనలో అతని పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. దీంతో తాజాగా ఇతర విషయాలు సైతం బయటకు వస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని