logo

విస్తరిస్తున్న వైరస్

జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి, రెండోదశలో లేనంత వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరగడం, సమూహాలుగా గుమికూడటం

Published : 18 Jan 2022 02:39 IST

 జిల్లాలో 176 మందికి పాజిటివ్‌
బాధితుల్లో ఆరుగురు ఉపాధ్యాయులు, 12 మంది వైద్యసిబ్బంది

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి, రెండోదశలో లేనంత వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు పెరగడం, సమూహాలుగా గుమికూడటం కూడా ఓ కారణం. రానున్న నాలుగురోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యాధికారులు అంచనా. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 మధ్య 2049 మందికి పరీక్షలు చేయగా 176 మందికి వైరస్‌ నిర్ధరణ అయింది. 8.6 పాజిటివిటీ రేటు నమోదైంది. 
అత్యధికంగా ఎక్కడెక్కడంటే: మార్కాపురం పలకల కార్మికుల కాలనీలో 78 మందికి పరీక్ష చేయగా 23 మందికి (29.5శాతం) కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒంగోలు యానాదికాలనీ అర్బన్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో 83 మందికి పరీక్ష చేయగా 19 మందికి నిర్ధరణ అయింది. ఒంగోలులో 74, మార్కాపురం పట్టణంలో 30, చీమకుర్తి, అద్దంకి, మార్టూరులో 5 నుంచి 10 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 894 క్రియాశీలక కేసులున్నాయి. సోమవారం వివిధ ప్రాంతాల్లో ఆరుగురు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. వారంతా సంక్రాంతి సెలవుల్లో పరీక్ష చేయించుకున్నట్లు సమాచారం. 
ఆసుపత్రుల్లోనూ..: మార్కాపురం జిల్లా వైద్యశాలలో 8 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ముగ్గురు కోలుకొని ప్రస్తుతం విధుల్లో చేరారు. మిగిలిన అయిదుగురు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అలాగే అద్దంకి సామాజిక ఆరోగ్యకేంద్రంలో పని చేసే ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. 
* మార్కాపురంలో కొద్దిరోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి నిత్యం 900 వరకు నమూనాలు తీస్తుండగా 40 లోపు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. సోమవారం ఈ సంఖ్య కూడా దాటిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని