logo

కొవిడ్‌చికిత్సకు మూడంచెలు

కొవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో చికిత్స చేయడానికి జిల్లాలో మూడంచెల విధానం అవలంబించాలని నిర్ణయించారు. పరీక్షలో పాజిటివ్‌ ఫలితం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రుల్లో చేరితే భవిష్యత్తులో పడకల సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా

Published : 18 Jan 2022 02:39 IST

జిల్లాలోని 49 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సౌకర్యం


జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కంట్రోల్‌ కేంద్రం

కొవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో చికిత్స చేయడానికి జిల్లాలో మూడంచెల విధానం అవలంబించాలని నిర్ణయించారు. పరీక్షలో పాజిటివ్‌ ఫలితం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసుపత్రుల్లో చేరితే భవిష్యత్తులో పడకల సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా బాధితులకు చికిత్స అందించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇప్పటికే జిల్లా అంతటా ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 49 ఆసుపత్రుల్లో సేవలందించడానికి నిర్ణయించారు.  

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం  కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి, వారి సన్నిహితులకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని.. పాజిటివ్‌ వస్తే వారి లక్షణాలను వైద్యాధికారి తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు మూడంచెల పద్ధతి (ట్రయాజినింగ్‌) అనుసరిస్తున్నారు. తేలికపాటి జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండేలా సూచిస్తారు. ఇంటివద్ద అవకాశం లేని వారిని కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు సిఫార్సు చేస్తారు. జలుబు, దగ్గుతోపాటు అయిదు రోజులు జ్వరం తగ్గకుండా ఉన్నా, ఆక్సిజన్‌ శాతం తగ్గుతున్నా, ఊపిరాడని పరిస్థితి ఉన్నా ఆసుపత్రుల్లో చేర్చి పడక కేటాయించి ప్రత్యేక చికిత్స అందిస్తారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌ పడక, లేదా వెంటిలేటర్‌ మీదికి మారుస్తారు. ఈ విధంగా పాజిటివ్‌ కేసులను గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. కాగా ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ బాధితుల్లో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ వేరియంట్‌ను నిర్ధరణ చేసేందుకు హైదరాబాద్‌ లేదా విజయవాడ ల్యాబ్‌కు పంపి జీనోమ్‌ సీక్వెన్స్‌ పరీక్ష చేయించాలి. విదేశాల నుంచి వచ్చినవారిలో కొందరి నమూనాలు తీసి పంపిస్తున్నారు. మిగిలినవారికి లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నారు.

ఈసారి సంఖ్య పెంచి..
కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. గత రెండు దశల్లో దాదాపు 2 వేల మంది ఈ విధంగా సేవలు పొందారు. రెండోదశలో 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వగా ఈసారి 49 ఆసుపత్రులకు ఇచ్చారు. వాటిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తూ భోజన ఏర్పాట్లు కూడా చేస్తారు. మొత్తం 49లో 19 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా మిగిలినవి ప్రైవేటువి.. సోమవారం నాటికి 51 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఏడుగురు ఉండగా, మిగిలిన వారంతా జీజీహెచ్‌లో ఉన్నారు. అక్కడ ఇద్దరు ఆక్సిజన్‌ సాయంతో, మరొకరు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా 986 క్రియాశీలక కేసులున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నాయి. ఈసారి సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేసి వైద్యాధికారి, సిబ్బందిని నియమించారు.


ఒంగోలులోని జీజీహెచ్‌

ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులివి: 
ఒంగోలు జీజీహెచ్, మాతా శిశువైద్యశాల (ఇక్కడ చిన్నపిల్లలకు).. చీరాల, కందుకూరు, మార్కాపురం జిల్లా వైద్యశాల, పామూరు, కొండపి, కనిగిరి, పొదిలి, మార్టూరు, చీమకుర్తి, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, ఉలవపాడు, దోర్నాల తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైద్యం అందిస్తారు. 

ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలపై జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను సమాచారం కోరగా ట్రయాజినింగ్‌ చేశాక ఆసుపత్రుల్లో చికిత్స అవసరమైన వారిని చేర్చుకుంటారన్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మూడోదశలో ఇప్పటివరకు 40 మందిని ఆరోగ్యశ్రీ కింద నమోదు చేసినట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని