logo

కొవిడ్‌ నిబంధనలెక్కడ..!

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ దీని బారినపడుతున్నవారి సంఖ్య 800 వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీనికి చిక్కకుండా చూసుకోవచ్ఛు ప్రస్తుతం అన్నిచోట్లా పాఠశాలలు నడుస్తున్నాయి. ఇప్పటికే పలువురు

Published : 22 Jan 2022 04:26 IST

పాఠశాలల్లో కానరాని భౌతిక దూరం

ఇప్పటికే 147 మందికి పాజిటివ్‌

మార్కాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇరుకిరుగ్గా విద్యార్థులు

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ దీని బారినపడుతున్నవారి సంఖ్య 800 వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీనికి చిక్కకుండా చూసుకోవచ్ఛు ప్రస్తుతం అన్నిచోట్లా పాఠశాలలు నడుస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో బడుల్లో మాస్కు ధారణ, శానిటైజ్‌, భౌతిక దూరం వంటివి కీలకం. అయినా అనేకచోట్ల ఇటువంటివేవీ కానరావడం లేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. - ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 15 సంవత్సరాలు దాటినవారు 73 వేలమంది ఉన్నారు. ఏడెనిమిది గంటలు పాఠశాలలు నడుస్తుంటాయి. భౌతిక దూరం పాటించడంలేదు. టేబుళ్లు, మరుగుదొడ్ల గదులు, ఇతర వస్తువులను తరచూ తాకే పిల్లలకు శానిటైజర్‌, సబ్బు నీరు అందుబాటులో ఉండటం లేదు. వైరస్‌ నుంచి రక్షించే ఏకైక ఆయుధం మాస్కు అని వైద్యారోగ్యశాఖ ప్రచారం చేస్తున్నప్పటికీ పిల్లలు వీటిని ధరించేలా అవగాహన ఉండడంలేదు. జిల్లాలో గత అయిదురోజుల్లో 147 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైరస్‌ సోకింది. మరికొన్నిచోట్ల వెలుగులోకి వస్తున్నాయి. యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 24 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఇటీవల వీరిలో అయిదుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ దాదాపు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కడైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే పిల్లలను ఇళ్లకు పంపిస్తున్నారు.

జమ్ములపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో గదులు సరిపోక నేలపై చదువులు

ఇదీ పరిస్థితి

కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడంలేదు. శానిటైజర్‌ సదుపాయం లేదు. కొందరు పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇటీవల కొందరు విద్యార్థులకు జలుబు, దగ్గు లక్షణాలు ఉండగా ఇళ్లకు పంపించేశారు. రెండు పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు ఇప్పటికే పాజిటివ్‌ వచ్చింది.

అద్దంకి మండలం తిమ్మాయపాలెం ఉన్నత పాఠశాలలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అందరూ మాస్కులు వాడుతున్నప్పటికీ భౌతిక దూరం లేదు. కొందరు గురువులు సొంత డబ్బులతో శానిటైజర్‌ కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. పండగ సెలవుల్లో ముగ్గురు ఉపాధ్యాయులకు కొవిడ్‌ సోకింది. వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉష్ణ పరీక్షలు చేయాల్సి ఉంది.

మార్కాపురం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మాస్కు, శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ పాటిస్తున్నప్పటికీ తరగతి గదుల కొరత ఉంది. ఒక్కో గదిలో 70 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. గదులు ఇరుకుగా ఉండటంతో దూరం పాటించడంలేదు. వైరస్‌ లక్షణాలు ఉన్న ఉపాధ్యాయులు, పిల్లలను మాత్రం ఇళ్లకు పంపుతున్నారు. జిల్లాలోని అనేక విద్యాలయాల్లో ఇదే పరిస్థితి.

టంగుటూరు మండలం జమ్ములపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 220 మంది పిల్లలు ఉన్నారు. భౌతిక దూరం పాటించే క్రమంలో గదులు సరిపోక నేలపై కూర్చోబెట్టారు.

అమలు చేసేలా ఆదేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 19 వేల మంది ఉపాధ్యాయులకు, 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు నూరుశాతం కొవిడ్‌ టీకా వేయించాం. ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయారు. దానిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను కొనసాగిస్తున్నాం. అన్నిచోట్ల కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా అమలుకాకుంటే పరిశీలించి భౌతిక దూరం, మాస్కు, శానిటైజర్‌ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటాం.-బి.విజయభాస్కర్‌, డీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని