logo

ఓటీసీ బాదుడు

ఆదాయ వనరుల కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం ఏకకాల మార్పిడి (వన్‌టైమ్‌ కన్వర్షన్‌-ఓటీసీ)పై దృష్టిసారించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రత్యేక డ్రైవ్‌ పేరుతో వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ

Published : 22 Jan 2022 04:26 IST

వ్యవసాయేతర నిర్మాణాల జాబితా సిద్ధం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఆదాయ వనరుల కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం ఏకకాల మార్పిడి (వన్‌టైమ్‌ కన్వర్షన్‌-ఓటీసీ)పై దృష్టిసారించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రత్యేక డ్రైవ్‌ పేరుతో వసూలు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నవి, ఇప్పటి వరకు పన్ను చెల్లించనవి, భూ మార్పిడి జరిగినా పూర్తిస్థాయిలో చెల్లించనవి మూడు కేటగిరిలుగా విభజించి నోటీసులు జారీచేస్తున్నారు. వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్న భూమిలో పన్ను చెల్లించని వారి జాబితాను రెవెన్యూ అధికారులు తయారుచేశారు. ఇలా జిల్లా నుంచి దాదాపు రూ.25 కోట్లు రావాల్సి ఉంటుందని లెక్కకట్టారు. ఇప్పటికే రూ.కోటి వరకు వసూలైనట్లు సమాచారం.

ఎప్పుడు నిర్మాణం జరిగినా వర్తింపు

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో చేపట్టిన వ్యవసాయేతర నిర్మాణాలకు నాలా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అలా ఎన్ని చేపట్టారు.. వాటికి సంబంధించి పన్ను, జరిమానా రూపంలో ఎంత మొత్తం వసూలు చేయాలన్నదానిపై కసరత్తు పూర్తయింది. వారి వివరాలు సేకరించి నోటీసులు అందజేస్తున్నారు. నిర్ణీత కాలపరిమితిలో క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందన్న ప్రభుత్వ ఆదేశాలు యజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది జులై 29న ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు 3 శాతంగా ఉన్న నాలా పన్నును 5 శాతానికి పెంచింది. మార్పిడి జరిగిన భూములకు విధించాల్సిన పన్నును పాత బకాయిదారులపై రుద్దుతున్నారని, 3శాతం వసూలు చేయాల్సిన చోట అపరాధరుసుము పేరుతో అధనంగా తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ మాట్లాడుతూ ఏదోవిధంగా ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తోందన్నారు..

ప్రయోజనాలు ఉన్నాయి

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు చట్టబద్ధంగా పన్ను చెల్లించాలి. అలా కట్టకుండా సొంత నిర్ణయంతో వినియోగించుకుంటే అపరాధ రుసుము కట్టాల్సి ఉంటుంది. ఓటీసీ వల్ల తెలియకుండా భూమి కొనుగోలు చేసినవారికి క్రమబద్దీకరణ ఇబ్బందులు తొలుగుతాయి. ప్రభుత్వానికి చట్టబద్ధంగా రావాల్సిన పన్నులు వస్తాయి. ఈ డ్రైవ్‌ కొనసాగుతోంది. దీనికి నిర్దిష్ట సమయం ఇంకా నిర్ణయించలేదు. - వెంకటమురళి, జేసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని