logo

గగనయానం..అయ్యేనా సాకారం

ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లా వాసుల్లోని ఆకాంక్ష మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం ఒంగోలు సమీపంలో అప్పటి ప్రభుత్వం

Published : 22 Jan 2022 04:26 IST

విమానాశ్రయం ఏర్పాటుపై ఆశలు

మూడు మండలాల్లో స్థల సేకరణపై దృష్టి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించడంతో జిల్లా వాసుల్లోని ఆకాంక్ష మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం ఒంగోలు సమీపంలో అప్పటి ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య సుమారు 3 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. అనంతరం వాటిపై సాంకేతిక సమస్యలు నెలకొని ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ విమానాశ్రయం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అద్దంకి, మార్టూరు, కొరిశపాడు మండలాలపై అధికారులు దృష్టిసారించారు.

వెయ్యి ఎకరాలు అవసరం

జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు స్వగ్రామాలకు వచ్చేటప్పుడు చెన్నై లేదా హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగేవారు. విజయవాడ సమీప గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తింపు వచ్చాక ఇప్పుడు ఎక్కువమంది అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గుంటూరుకు ఉత్తరం వైపున ఉన్న మండలాలకు గన్నవరం దగ్గర కానుంది. పైగా ప్రయాణికులకు షాపింగ్‌కు కూడా అనుకూలంగా ఉండనుండటంతో అక్కడికే వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వాసులతోపాటు, గుంటూరుకు దక్షిణం వైపున ఉన్న మండలాలకు అనుకూలంగా ఉండేలా విమానాశ్రయాన్ని జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంత వాసుల రాకపోకలకు సైతం ఉపకరించేలా మార్టూరు, అద్దంకి, కొరిశపాడు ప్రాంతాల్లో స్థల సేకరణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వేను అభివృద్ధి చేసేందుకు మొత్తం వెయ్యి ఎకరాలు అవసరం కానున్నట్లు యంత్రాంగం భావిస్తోంది.

పరిహారం ఇచ్చి ..

విమానాల రాకపోకలు, ల్యాండింగ్‌ సమస్య వంటివి రాకుండా అధికారులు స్థలాలపై దృష్టిపెట్టారు. అద్దంకి సమీపంలో నామ్‌రోడ్డుకు పడమర వైపున కొంగపాడు, చక్రాయపాలెం గ్రామాల వద్ద; అద్దంకి-ముండ్లమూరు రోడ్డులో తిమ్మాయిపాలెం వద్ద సుమారు 1000 ఎకరాల ప్రైవేట్‌ భూములను రెవెన్యూ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ప్రభుత్వం అత్యవసరంగా భావిస్తే ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా రైతులకు పరిహారం ఇచ్చి భూములు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మార్టూరు, కొరిశపాడు మండలాల్లోనూ చూస్తున్నారు. మార్టూరు నుంచి నాగరాజుపల్లె వరకు కొండ ప్రాంతం విస్తరించి ఉంది. అది తొలిచేందుకు భారీగా నిధులు అవసరం. పైగా పక్కన పొలాలను సేకరించాల్సి ఉంది. దీంతో పునరాలోచిస్తున్నారు. ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా మూడు మండలాల్లో ముందస్తుగా అవసరమైన భూములను పరిశీలించాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు