logo

వాగులు పూడ్చి .. కాలువలు చదును చేసి...

జిల్లా కేంద్రానికి అత్యంత సమీప ప్రాంతం.. నాలుగు వరుసల రహదారిగా ఏర్పాటు కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఒంగోలు- కర్నూలు రహదారిలోని భూములపై కొందరి కళ్లు పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంచుతూ వచ్చిన భూముల్లోనూ

Published : 22 Jan 2022 04:26 IST

ఇష్టారీతిన కర్నూలు రహదారిలో వెంచర్లు

పంట కాలువ కట్టకు రెండు వైపులా చదును చేసిన భూములు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రానికి అత్యంత సమీప ప్రాంతం.. నాలుగు వరుసల రహదారిగా ఏర్పాటు కావడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఒంగోలు- కర్నూలు రహదారిలోని భూములపై కొందరి కళ్లు పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంచుతూ వచ్చిన భూముల్లోనూ ఇప్పుడు వెంచర్లు వెలుస్తున్నాయి. ఒంగోలు నుంచి పేర్నమిట్ట వరకు ఉన్న రహదారి వెంట ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.

రాత్రికి రాత్రే చదును చేస్తూ...: కర్నూలు వెంట భూములు ఇప్పుడు ఖరీదైనవిగా మారాయి. రాత్రికి రాత్రే ఎర్రమట్టి తోలి భూములను చదును చేసే పనులు చేస్తున్నారు. వెంచర్లుగా ఏర్పాటు చేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. వీటిల్లో అనుమతులున్నవేవో అనేది కొనుగోలుదారులకు అర్థం కాని పరిస్థితి. రోడ్డు పక్కనున్న వ్యవసాయ భూములను గతంలోనే చాలా మంది కన్వర్షన్‌ చేసుకున్నారు. లోపలి వాటిని చేయలేదు. ఇప్పుడు రహదారికి దూరంలో ఉన్న పొలాలనూ చదును చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. దీనిపై దృష్టిసారించాల్సిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు పరిశీలనతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి.

వాగులు, కాలువలనూ వదలడం లేదు...: కర్నూలు రహదారి వెంట ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాలువలు, వాగులను కూడా వదలకుండా చదును చేసి ప్లాట్లు ఏర్పాటు చేస్తుండటం ఇందుకు నిదర్శనం. సంతనూతలపాడు ఏఎంసీ కార్యాలయం సమీపంలో రహదారి వెంటనున్న కాలువను చదును చేశారు. దీనిపై కట్టడాలు చేపట్టేందుకూ సిద్ధమవుతున్నారు. ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి వెంట కొందరు సొంత స్థలంతో పాటు వాగును కూడా కలిపి చదును చేశారు. పేర్నమిట్టలోని చెరువు కట్ట సమీపంలో రహదారి అంచులనూ వదలకుండా ఎర్రమట్టి తోలి చదును చేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ రామానాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల్లో ప్లాట్‌లు ఏర్పాటు చేయాలంటే అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. కర్నూలు రహదారి వెంట వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారిలో కొందరు అనుమతులు పొందగా.. మరికొందరు ఇంకా దరఖాస్తు చేయలేదని తెలిపారు. అటువంటి వాటిని పరిశీలించి నోటీసులు జారీ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని