logo

ఇసుక కొరతతో ఇక్కట్లు

ఇసుక కొరత నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గ కేంద్రాలలో ఇసుక నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినా ప్రజలకు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Published : 23 Jan 2022 03:31 IST

అభివృద్ధి పనులకు ఆటంకం 
అదనపు వసూళ్లపై ఫిర్యాదులు


పర్చూరు యార్డులో ఖాళీగా ఉన్న ఇసుక నిల్వ కేంద్రం

పర్చూరు, న్యూస్‌టుడే :  ఇసుక కొరత నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గ కేంద్రాలలో ఇసుక నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినా ప్రజలకు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
పర్చూరు యార్డు ప్రాంగణంలో ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటు చేశారు. పర్చూరు, చీరాల నియోజకవర్గ కేంద్రాల పరిధిలోని గ్రామాలకు ఇక్కడ నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇసుక నిల్వ సరిపడినంత లేని కారణంగా గత 3 నెలలుగా ప్రైవేటు వ్యక్తులకు ఇసుక సరఫరా చేయడం లేదు. కేవలం ప్రభుత్వ గృహాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. టన్ను రూ.885లు  చొప్పున ప్రైవేటు వ్యక్తుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ గృహాల నిర్మాణానికి మాత్రం ఉచితంగా సరఫరా చేయాలి. గృహనిర్మాణశాఖ అధికారులు ఇసుక అవసరానికి సంబంధించి లబ్ధిదారులకు స్లిప్పులు జారీ చేస్తారు. వాటిని పర్చూరు యార్డు లోని నిల్వ కేంద్రంలో అందజేస్తే ఇసుక లోడింగ్‌ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీ ప్రతినిధులపై ఉంది. రవాణా ఖర్చు లబ్ధిదారులే భరించాలి.  ఈనెల 19వ తేదీన గృహనిర్మాణ లబ్ధిదారుల నుంచి అదనంగా రూ.500లు వసూలు చేస్తున్నారు.
వివాదాస్పదం :  రెండేళ్ల క్రితం యార్డు ప్రాంగణంలో ఒక మూలన నిల్వ చేసిన నాణ్యతలేని మట్టి శాతం అధికంగా ఉన్న ఇసుకను గృహనిర్మాణ లబ్ధిదారులకు ఇచ్చారు. దీనికి కూడా ట్రాక్టర్‌కు లోడింగ్‌కు రూ.500లు చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేయడం వివాదాస్పదమైంది. లబ్ధిదారుల ఫిర్యాదుపై గృహనిర్మాణశాఖ డీఈ ఎన్‌.మురళి ఇసుక కేంద్రాన్ని సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేయడంపై ఏజెన్సీ ప్రతినిధిని ప్రశ్నించారు. సమస్యను సంయుక్త కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాధన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అదనపు వసూలు ఆపేశారు. మట్టి శాతం అదనంగా ఉన్న ఇసుకను తీసుకోవాల్సిన అవసరం లేదని గృహనిర్మాణశాఖ అధికారులు లబ్ధిదారులకు సూచించారు. ఇసుక కొరత కారణంగా గృహ నిర్మాణాలు,  ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
అనూహ్యంగా పెరిగింది :  పర్చూరు నిల్వ కేంద్రంలో ఇసుక లేకపోవడంతో పర్చూరు, చీరాల నియోజక వర్గాల్లోని ఇళ్ల నిర్మాణంతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల సకాలంలో పనులు జరగడంలేదని పనులు చేపట్టిన వారు వాపోతున్నారు. ప్రభుత్వం టన్ను రూ.885లకు సరఫరా చేస్తుండగా అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులకు ఇదే ధరకు సరఫరా చేస్తున్నారు. అమరావతి, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యక్తులు ఇసుక తెప్పించుకుంటున్నారు. 30 టన్నుల లారీ రూ.27 వేలకు ఇంటికి చేరుతున్నట్లు చెబుతున్నారు. దీనిని పరిశీలిస్తే ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక తక్కువ ధరకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. ఇసుక ధర అనూహ్యంగా పెంచడంతో పాటు పలు రకాల నిబంధనల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక కొరతపై ఉన్నతాధికారులు దృష్టి సారించి నాణ్యమైన ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు