logo

వైద్యం అందించే నాథుడే కరవు

ఓ ప్రజాప్రతినిధి ప్రమాదానికి గురై వైద్యసాయం కోసం అర్థించాల్సిన దుస్థితి శనివారం మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. ద్రోణాదులకు చెందిన సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు, పల్లెపోగు జాన్‌వెస్లీలు ద్విచక్రవాహనం పై వస్తుండగా జొన్నతాళి కూడలి

Published : 23 Jan 2022 03:31 IST


రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న జడ్పీ ఉపాధ్యక్షురాలు సుజ్ఞానమ్మ

మార్టూరు, న్యూస్‌టుడే: ఓ ప్రజాప్రతినిధి ప్రమాదానికి గురై వైద్యసాయం కోసం అర్థించాల్సిన దుస్థితి శనివారం మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. ద్రోణాదులకు చెందిన సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు, పల్లెపోగు జాన్‌వెస్లీలు ద్విచక్రవాహనం పై వస్తుండగా జొన్నతాళి కూడలి వద్ద ట్రాక్టర్‌ ఢీ కొనడంతో గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడ్డ భాగ్యారావు వైద్యసేవలకు మార్టూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. ఆ సమయంలో చిన్నపిల్లల వైద్యుడు మాత్రమే ఉన్నారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు నర్సులు శ్రమించాల్సి వచ్చింది. 30 పడకల వైద్యశాలలో ఒక్క డాక్టరే ఉండటం, ప్రజాప్రతినిధికి కనీస వైద్య సేవలు అందని విషయం తెలుసుకున్న జడ్పీ ఉపాధ్యక్షురాలు చుండి సుజ్ఞానమ్మ, పలువురు వైకాపా నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్‌ను, సిబ్బందిని నిలదీశారు. కనీస సేవలు అందించకుండా ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలకు రెఫర్‌ చేయడాన్ని ఆక్షేపించారు. కొవిడ్‌ సేవలందించే ప్రత్యేక హాల్‌ ఉన్నప్పటికీ వారికి వైద్యసాయం అందించే సిబ్బంది కాని, నిపుణులు లేకపోవడంపై  ఆవేదన  వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యులు, సిబ్బందిపై జిల్లా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
రేపటి సంతకం కూడా నేడే : మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు జడ్పీ ఉపాధ్యక్షురాలు సుజ్ఞానమ్మ పరిశీలనతో తేటతెల్లమైంది. ఆసుపత్రిలో వైద్యం అందటం లేదని పలువురు రోగులు ఆమె ముందు ఆవేదన వ్యక్తం చేయగా, కార్యాలయంలోని రిజిష్టర్‌ను తెప్పించి అందరి ముందు పరిశీలించారు. అందులో కొంత మంది ఉద్యోగులు  రేపటి రోజు (23వతేదీ )విధులకు హాజరైనట్లు ముందే సంతకం పెట్టి ఉండటం చూసి విస్తుపోయారు. మొత్తం 24 మంది ఉద్యోగులు ఆ శాఖలో పని చేస్తుండగా 13 మంది హాజరైనట్లు రిజిష్టర్‌లో నమోదై ఉంది. 8 మంది సంతకాలు లేకుండా దస్త్రాల్లో ఖాళీ ఉంది. అయితే విధుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం గమనార్హం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని