logo

పిల్లలూ... తగ్గాలి జోరు

జిల్లాలో ఇటీవల మైనర్లు ఎక్కడ చూసినా రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే తీసేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో తల్లిదండ్రులు పిల్లలకు ద్విచక్ర వాహనాలు నేర్పించడం...వెంటనే వారే స్వయంగా నడిపేలా

Published : 23 Jan 2022 03:31 IST

ఒంగోలు వంటవారి కాలనీకి చెందిన కె.రవికిరణ్‌(13) నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.. పీవీఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో చదివే ప్రభాకర్‌ స్నేహితుడు. ఈనెల 17న ఓ ద్విచక్రవాహనంపై ఇద్దరూ హైదరాబాద్‌ బయలుదేరారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద విభాగినిని వీరి వాహనం ఢీకొట్టింది. రవికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సరదా కోసం వారు చేసిన చిన్న తప్పిదం కుటుంబాల్లో చీకట్లను మిగిల్చింది.  కనిగిరి పట్టణంలోనూ రెండు నెలల క్రితం ఇద్దరు బాలురు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. 

మార్కాపురం గడియార స్తంభం న్యూస్‌టుడే: జిల్లాలో ఇటీవల మైనర్లు ఎక్కడ చూసినా రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతున్నారు. వాహనం నడిపేందుకు తగిన వయసు లేకుండానే తీసేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో తల్లిదండ్రులు పిల్లలకు ద్విచక్ర వాహనాలు నేర్పించడం...వెంటనే వారే స్వయంగా నడిపేలా ప్రోత్సహించడం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, వారికి తెలియకుండానో బండిని తీసుకెళ్లడంతో తరచూ ఎక్కడో చోట పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. కొంత మందికి గాయాలు కాగా మరికొంతమంది శాశ్వత వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారు. స్థానిక పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధించడం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. పిల్లలకు వాహనం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

మైనర్లకు బండిస్తే తల్లిదండ్రులదే బాధ్యత
నిబంధనల ప్రకారం నిర్ణీత 18 ఏళ్లు దాటని వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందకుండా వాహనం నడిపేందుకు వీలులేదు. ఇలా నడిపితే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. పిల్లలపై పెద్దలు నిరంతర నిఘా ఉంచాలి.తగిన వయస్సు వచ్చేంత వరకు పొరపాటున కూడా వారికి డ్రైవింగ్‌ నేర్పించకూడదు. చాలా మంది చిన్నతనంలోనే ఖరీదైన వాహనాలు ఇప్పిస్తుండటంతోనే అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో తనతో పాటు ఎదుటివారికి హాని కలిగిస్తున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. -కరుణాకరణ్, ఎంవీఐ, మార్కాపురం యూనిట్‌

కఠిన చట్టాలున్నా..... 
* మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్లు వయస్సు గల వారు మాత్రమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు అర్హులు. రవాణాశాఖ అధికారులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే మాత్రమే దీనిని మంజూరు చేస్తారు. 
* అనుమతిలేని వారికి వాహనం ఇస్తే ఎంవీ యాక్టు 1988లోని సెక్షన్‌ 3 ఉల్లంఘన కింద మొదటిసారి రూ.5 వేలు జరిమానా ఉంటుంది. మళ్లీ అదే తప్పు చేసి పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారు. దీనిపై బాధ్యులైనవారికి మూడు నెలల శిక్ష ఉంటుంది.
* డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అర్హతలేని వారికి వాహనం ఇస్తే సెక్షన్‌ 182(1) ప్రకారం రూ.10 వేల జరిమానా పడుతుంది.  
* నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాన్ని మార్పులు చేసిన వారిపై సెక్షన్‌ 182ఏ(1) కింద రూ.లక్ష జరిమానా విధిస్తారు. 
* ప్రమాదకరంగా వాహనం నడుపుతూ ఎదుటివారికి హాని కలిగిస్తే సెక్షన్‌ 186 కింద మొదటి సారి రూ.2 వేలు రెండోసారి రూ.10 వేలు విధిస్తారు.
* మూడు సార్లకు మించి వాహనం పట్టుబడితే జప్తు చేసేందుకు సంబంధితశాఖ అధికారులకు పూర్తి బాధ్యత  కల్పించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని