logo

కక్షగట్టి...కడతేర్చి

కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీ పరిధిలోని అంబటివారిపాలెం శివార్లలో మీరాంబి అలియాస్‌ మీరమ్మ(47) తన భర్త మస్తాన్, కుమారుడు అలీఫ్‌(23)తో కలిసి నివసిస్తున్నారు. మస్తాన్‌ బేల్దారి పనులు చేసుకుంటుండగా మీరాంబి కూలీ పనులు చేస్తుంటారు.

Updated : 23 Jan 2022 03:35 IST

హత్యోదంతాలతో కలిగిరి, ఒంగోలులో కలకలం
తల్లీ కుమారుడిని చంపి ఆ పై మరో యువకుడిపై దాడి


జంట హత్యలు జరిగిన ఇల్లు ఇదే...

సహజీవనం చేస్తున్న మహిళను దాచారని, తన నుంచి ఆమెను దూరం చేస్తున్నారనే కక్షతో అతడు దారుణానికి ఒడిగట్టాడు... పట్టపగలే కత్తితో ఓ తల్లి, కుమారుడిని కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాదు ఒంగోలు నగరం వచ్చి మరో యువకుడిపైనా అదే ఊపున దాడిచేశాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెం, ఇటు ఒంగోలు నగరంలో ఒకేరోజు జరిగిన ఈ హత్యోదంతాలు కలకలం రేపాయి.  - న్యూస్‌టుడే, కలిగిరి, ఒంగోలు నేర విభాగం

కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీ పరిధిలోని అంబటివారిపాలెం శివార్లలో మీరాంబి అలియాస్‌ మీరమ్మ(47) తన భర్త మస్తాన్, కుమారుడు అలీఫ్‌(23)తో కలిసి నివసిస్తున్నారు. మస్తాన్‌ బేల్దారి పనులు చేసుకుంటుండగా మీరాంబి కూలీ పనులు చేస్తుంటారు. అలీఫ్‌ డిగ్రీ చదువుతున్నాడు. మస్తాన్‌ వరుసకు చెల్లెలైన మహిళకు నెల్లూరులో వివాహం చేశారు. కొన్నేళ్ల తరువాత భర్తతో ఆమె విడిపోయారు. పోలంపాడుకు చెందిన బంధువైన షేక్‌ రబ్బానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
మనస్పర్థలు తలెత్తి...
పదేళ్లుగా కలిసి ఉన్న వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలొచ్చాయి. కుమారుడిని తీసుకొని ఆ మహిళ నెల్లూరుకు చేరుకుంది. తన నుంచి ఆమెను దూరం చేస్తున్నారని గ్రహంచిన రబ్బానీ... మీరాంబి కుటుంబీకులపై అనుమానం పెంచుకున్నాడు. శనివారం ద్విచక్రవాహనంపై అంబటివారిపాలెం వెళ్లాడు. మీరాంబి ఇంట్లో ఉండగా భర్త పని నిమిత్తం నెల్లూరుకు వెళ్లారు. అలీఫ్‌ ఇంటికి కొద్ది దూరంలో ఉన్నాడు. నేరుగా మీరాంబి ఇంటికెళ్లిన రబ్బానీ ఆమెతో ఘర్షణకు దిగి వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. బయట ఉన్న కుమారుడు ఇంటికి రాగా తల్లి రక్తపు మడుగులో పడి ఉండటంతో బోరున విలపించాడు. కత్తితో అలీఫ్‌ ఛాతీపై బలంగా పొడవడంతో భయభ్రాంతులకు గురై పెద్దగా కేకలు వేస్తూ బయటకొచ్చి మృతిచెందాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు రబ్బానీ అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. ఉదయం పది గంటల సమయంలో జరిగిన ఈ దారుణంతో గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. సమాచారం తెలుసుకున్న కావలి డీఎస్పీ ప్రసాద్, కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను శవ పంచనాయా నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.


సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న కావలి డీఎస్పీ , కలిగిరి సీˆఐలు 

వరుస ఉదంతాలతో...
ఒంగోలు నగరంలో పట్టపగలే దారుణాలు జరుగుతున్నాయి. హంతకులు, రౌడీలు ఇష్టా రాజ్యంగా పేట్రేగిపోతున్నారు. సుమారు ఏడాది క్రితం స్థానిక రంగారాయుడి చెరువు వద్ద ఉదయం 10 గంటల సమయంలోనే ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడో వ్యక్తి. పట్టుకొనేందుకు యత్నించినవారిని సైతం బెదిరించాడు. అయిదు నెలల క్రితం స్థానిక మంగమూరు రోడ్డులో రెండు గ్రూపులు గ్యాంగ్‌వార్‌కు తలపడ్డాయి. పోలీసుల ముందే రక్తమోడేలా అత్యంత పైశాచికంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఉదంతంలో నిందితులపై రౌడీ షీట్‌లు తెరుస్తామని బహిరంగంగా ప్రకటించిన అధికారులు ఆ తరువాత మిన్నకుండిపోయారు. రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆ కేసులో అంతకు మించి ముందుకు వెళ్లలేకపోయారనే విమర్శలున్నాయి.

వెనువెంటనే ఒంగోలు వచ్చి..
అంబటివారిపాలెం నుంచి రబ్బానీ ఒంగోలు చేరుకున్నాడు. తన టీ దుకాణంలో పనిచేసిన కాశీరావు తనతో సహజీవనం చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తీసుకువెళ్లిపోయాడన్న కోపంతో అతడి కోసం అన్వేషించాడు. శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఒంగోలులోని గుంటూరు రోడ్డులో కాశీరావుపై అంతా చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. అతని గొంతు కోశాడు. అంతటితో కసి తీరక మళ్లీ కడుపులో మూడు పోట్లు పొడిచాడు. రవిప్రియ మాల్‌ సమీపంలో రబ్బానీ సాగించిన ఈ దారుణం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకొన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాలూకా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఉదయం అంబటివారిపాలెంలో చేసిన దారుణం తెలిసింది.  తమ విచారణలో వెల్లడించిన అంశాలను తాలూకా పోలీసులు నెల్లూరు జిల్లా అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. కాగా రబ్బానీ ఇటీవల వరకు ఒంగోలు సత్యనారాయణపురంలో ఉండేవాడు. కాశీరావు స్వస్థలం మార్కాపురం. అతను కూడా ఇక్కడే ఉండేవాడు. దాడికి గురైన కాశీరావు విషమ స్థితిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


కాశీరావుపై కత్తితో దాడిచేస్తున్న రబ్బానీ ( సీసీ ఫుటేజీ దృశ్యం) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని