logo

బిడ్డా..ఇది నా అడ్డా...

ఇద్దరు డీఎస్పీలు.. ఇద్దరు సీఐలు.. అదనంగా ఎస్సైలు.. ఒక్కటంటే ఒక్కటే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌. ఉదయం 11 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎడతెగని పంచాయితీ. చివరికి పట్టుకున్న ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించలేకపోయారు.

Published : 24 Jan 2022 05:19 IST

ప్రభుత్వం మాది.. మాట వినాలి మీరు

అధికారులపై ఇసుక మాఫియా జులుం

గ్రామంలో పర్యటిస్తున్న ఒంగోలు పోలీసు,

సెబ్‌ డీఎస్పీలు నాగరాజు, సుధీర్‌బాబు

ఇద్దరు డీఎస్పీలు.. ఇద్దరు సీఐలు.. అదనంగా ఎస్సైలు.. ఒక్కటంటే ఒక్కటే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌. ఉదయం 11 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎడతెగని పంచాయితీ. చివరికి పట్టుకున్న ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించలేకపోయారు. ఇసుకను అక్కడే వదిలేసి ట్రాక్టర్‌ను అప్పగించేసి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కొత్తపట్నం మండలం మడనూరులో ఆదివారం చోటుచేసుకుంది.

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మడనూరులో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు సెబ్‌ సీఐ లతకు సమాచారం అందింది. దీంతో ఆమె సిబ్బందితో ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఒక వ్యక్తి ఏపీ 27 టీజీ 2957 నెంబర్‌ ట్రాక్టర్‌లో ఇసుక నింపుకొని వస్తుండగా సెబ్‌ సీఐ లత ఆధ్వర్యంలో సిబ్బంది అడ్డుకున్నారు. అంతే ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది. ‘నేనిక్కడ అధికార పార్టీ నాయకుడ్ని. ఇక్కడెవరైనా నా మాట వినాల్సిందే. ఈ మండలంలో ఎవరి ట్రాక్టర్లను పోలీసులు ఆపినా నేను పంచాయితీ చేస్తుంటా. చివరికి నా ట్రాక్టర్‌నే ఆపేస్తే తర్వాత నా పరిస్థితేంటి’ అంటూ సంబంధిత యజమాని ప్రమోద్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సెబ్‌ అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితిని ఉన్నతాధికారులకు సిబ్బంది వివరించారు.

డీఎస్ఫీ. వచ్చినప్పటికీ..: విషయం తెలుసుకున్న సెబ్‌ డీఎస్పీ సుధీర్‌బాబు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చేసేదేమీ లేక రెండో పట్టణ సీఐ రాఘవరావుకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు కొత్తపట్నం ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని చర్చలు సాగించారు.

ఏమీ చేయలేక.. ఎటూ పాలుపోక...: ఇటు పోలీసులు, అటు సెబ్‌ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పట్టుకున్న ట్రాక్టర్‌లో ఉన్న ఇసుకను ఓ ఖాళీ స్థలంలో పోయించారు. ఆ తర్వాత ట్రాక్టర్‌ను సంబంధిత యజమానికి అప్పగించేసి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఉదంతంపై సెబ్‌ సీఐ లత కొత్తపట్నం పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన ఈ పంచాయితీ ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కొనసాగడం గమనార్హం. ఈ విషయమై ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు మాట్లాడుతూ.. సెబ్‌ అధికారులు ఇసుకను తరలించే ట్రాక్టర్‌ను పట్టుకుంటే స్థానికులు అడ్డుకున్నట్టు చెప్పారు. సెబ్‌ అధికారుల ఫిర్యాదుతో తాము అక్కడికి వెళ్లామని.. ఊరంతా అక్కడే ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చినట్టు తెలిపారు. కేసు నమోదు చేశామని.. సమగ్రంగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇసుక ట్రాక్టర్‌ను తీసుకెళ్లకుండా గుమికూడిన మడనూరు వాసులు

పట్టుకున్న ట్రాక్టర్‌లోని ఇసుకను ఖాళీ స్థలంలో పారబోయిస్తున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని