logo

నిషిద్ధం..పరిసమాప్తం

దేవాదాయ శాఖ అధికారులు అనాలోచితంగా చేసిన తప్పిదానికి కందుకూరు పట్టణంలో సుమారు వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ సమస్య సుమారు ఏడాదిన్నరగా 15 వార్డుల్లోని వందల మందిని వేధిస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ

Published : 24 Jan 2022 05:19 IST

సర్వే నంబర్‌ 865-1ఎ1ఎ2ఎ1కు మోక్షం

‘ఈనాడు’ వరుస కథనాలకు స్పందన

సమస్యను తెలుపుతూ ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే : దేవాదాయ శాఖ అధికారులు అనాలోచితంగా చేసిన తప్పిదానికి కందుకూరు పట్టణంలో సుమారు వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ సమస్య సుమారు ఏడాదిన్నరగా 15 వార్డుల్లోని వందల మందిని వేధిస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. చివరికి న్యాయస్థానం సూచనలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సమస్య పరిష్కారం కానుంది. సర్వే నంబర్‌ 865-1ఎ1ఎ2ఎ1ను నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు సాగే అవకాశం ఉంది.

జాబితాలోకి 316.16 ఎకరాలు...: కందుకూరు పట్టణంలో సర్వే నంబర్‌ 865-1లో ఆర్‌ఎస్‌ఆర్‌ దాఖలా 316.16 ఎకరాలు గ్రామకంఠంగా నమోదై ఉంది. అందులో కొంత భూమి దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు గతంలో కేటాయించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ప్రాంతాలు, ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాలు ఈ సర్వే నంబరులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలనే ఆలోచనతో దేవాదాయ శాఖ అధికారులు నిషిద్ధ జాబితా(22ఎ)లో చేర్చాలని రిజిస్ట్రేషన్‌ శాఖకు 2020 జూన్‌లో లేఖ రాశారు. వాస్తవానికి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి కేవలం 6.01 ఎకరాలు మాత్రమే. అంతవరకు సబ్‌ డివిజన్‌ చేయించుకుని నిషిద్ధ జాబితాలో చేరిస్తే సరిపోయేది. కానీ అధికారులు అలా కాకుండా మొత్తం సర్వే నంబర్‌ను(316.16 ఎకరాలు) నిషిద్ధ జాబితాలో చేర్చడంతో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. చివరికి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సూచనల మేరకు దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఆ నంబర్‌ను నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని