logo

అరుదైన పాఠశాల..నల్లమల

రాష్ట్రంలో ఏకైక పులుల అభయారణ్యం నల్లమల. దీనిలో వ్యాఘ్రాలతో పాటు పలు రకాల వన్యప్రాణులు, కీటకాలు, పక్షులు, ఔషధ మొక్కలు, వృక్షాలు తదితర జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. అటవీశాఖ ఉద్యోగం పొందిన వారికి రాష్ట్రంలోని రాజమండ్రి

Updated : 24 Jan 2022 06:01 IST

శిక్షణార్థులకు విజ్ఞాన సర్వస్వం

ఎన్నో పాఠాలు నేర్పే అభయారణ్యం

ఎకో టూరిజం వద్ద అటవీ శిక్షణ ఉద్యోగులు

రాష్ట్రంలో ఏకైక పులుల అభయారణ్యం నల్లమల. దీనిలో వ్యాఘ్రాలతో పాటు పలు రకాల వన్యప్రాణులు, కీటకాలు, పక్షులు, ఔషధ మొక్కలు, వృక్షాలు తదితర జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. అటవీశాఖ ఉద్యోగం పొందిన వారికి రాష్ట్రంలోని రాజమండ్రి, తెలంగాణా రాష్ట్రంలోని వారికి హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. ఆ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారికి నల్లమల విశేష పర్యావరణ విజ్ఞానాన్ని అందిస్తోంది. అటవీ సంపద పెంపుదల, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అటవీ అధికారులు వివరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత వారు సందర్శించి తెలుసుకున్న విషయాలపై పరీక్షలు నిర్వహిస్తారు. స్థానిక అటవీ అధికారులు వారికి ఈ ప్రాంతంలో చూపించే ప్రదేశాలు, వారికి వివరించే వాటి గురించి తెలుసుకుందామా.... - న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

దేశంలో ఉన్న పులుల అభయారణ్యాల్లో నల్లమల విశాలమైంది. రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో విస్తరించింది. 3,568 చ.కిమీ పరిధిలో సువిశాలమైన ప్రాంత సంరక్షణకు ప్రభుత్వం నియమించే సిబ్బంది సరిపోరు. నల్లమలలోని చెంచు గిరిజన గూడేల్లో నివసించే వారి సహకారాన్ని తీసుకుంటారు. ఇలా అన్ని అంశాలనూ శిక్షణలో వివరిస్తారు.

అటవీ రక్షణ.... చెంచు గిరిజనులకు ఉపాధి

అటవీ రక్షణలో చెంచు గిరిజనులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నల్లమల లోతట్టు ప్రాంతాల్లో ఉండే గిరిజన గూడేల్లోని చెంచు గిరిజనులు అడవిని, వన్య ప్రాణులను నిరంతరం కాపాడుతుంటారు. ప్రభుత్వం వారిని టైగర్‌ టేకర్స్‌, ఫైర్‌ వాచర్లు, స్వచ్ఛ సేవకులుగా ఉపయోగించుకుని ఉపాధి కల్పిస్తోంది. అటవీశాఖ బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వాటిలో అయిదుగురు చెంచు గిరిజనులకు టైగర్‌ టేకర్స్‌గా నియమించింది. వారు అక్కడే ఉండి వారికి నిర్దేశించిన ప్రాంతంలోకి కలప దొంగలు ప్రవేశించకుండా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వన్యప్రాణులకు హాని కలగకుండా చూస్తారు. వేసవి కాలంలో ఫైర్‌ వాచర్లను నియమిస్తారు. వారు అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు వెళ్లి మంటలను ఆర్పివేస్తారు. పెద్దదోర్నాల-శ్రీశైలం, పెద్దదోర్నాల-ఆత్మకూరు రహదారుల్లో భక్తులు, ప్రయాణికులు ఆ దారుల వెంట వేసే ప్లాస్టిక్‌, చెత్తా చెదారాలను స్వచ్ఛ సేవకులు తొలగిస్తారు. వాటిని రీసైక్లింగ్‌కు పంపిస్తారు. ఇలా స్మగ్లర్లు మొదలు .. ప్లాస్టిక్‌ వ్యర్థాల వరకూ అన్నింటిని శిక్షణలో వివరిస్తారు. అటవీ-వన్యప్రాణుల సంరక్షణతో పాటు అడవిలో నివసించే చెంచు గిరిజనులకు జీవనోపాధి కలిగించడంపై కేంద్ర ప్రభుత్వం 2011లో నాగార్జున-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌కు పురస్కారం సైతం అందించింది.

వర్షమే ఆధారం

నల్లమలలో నిరంతరం ప్రవహించే వాగులు, వంకలు ఉండవు. వర్షం కురిస్తేనే వాటిలో నీరు చేరుతుంది. వేసవిలో నీటి కొరతతో పాటు అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివి సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది శిక్షణలో అవగతమవుతుంది. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో సాసర్‌ పిట్లు ఏర్పాటు చేసి వాటిల్లో బయటి నుంచి ట్రాక్టర్లతో నీరు తెచ్చిపోస్తారు. లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చోట్ల డీప్‌బోర్లు వేసి సౌర పంపులతో చెరువులు, కుంటలు నింపి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తారు. అగ్నిప్రమాదాలు జరిగినా అవి విస్తరించకుండా ఫైర్‌లైన్‌, వ్యూలైన్‌లు ఏర్పాటు చేస్తారు. అవి మంటలను పూర్తిస్థాయిలో వ్యాపించకుండా నివారిస్తాయి. ఆ లోపు మంటలను ఫైర్‌ వాచర్లు ఆర్పివేస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

సందర్శన ప్రాంతం పులిచెరువు

దోర్నాల-శ్రీశైలం రహదారిలోని తుమ్మలబైలుకు 10 కి.మీల దూరంలోని లోతట్టు ప్రాంతంలో పులిచెరువు ఉంది. ఈ చెరువులోని నీరు తాగేందుకు తరచుగా పులులు వస్తుంటాయి. నల్లమల వీక్షించేందుకు వచ్చే ఇతర దేశాల వారితో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే అధికారులు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆ ప్రాంతంలో పులుల అడుగులను పరిశీలిస్తారు.

పక్కాగా గణన

విశాలమైన నల్లమలలో పులుల గణన చాలా క్లిష్టతరమైంది. గతంలో అటవీ సిబ్బంది వాటి అడుగులను ప్లాస్టరాఫ్‌ పారిస్‌తో సేకరించి తద్వారా వాటిని లెక్కించేవారు. అలా చేయడంతో కచ్చితమైన సంఖ్య వచ్చేది కాదు. నేటి కాలంలో సాంకేతికతను వినియోగించడం ప్రారంభించారు. చెట్లకు కెమెరా ట్రాప్‌లను ఎదురెదురుగా బిగిస్తారు. అవి అటువైపు సంచరించిన వన్యప్రాణుల ఫొటోలను తీస్తుంది. పులులను చారలను బట్టి లెక్కిస్తారు. ఏ రెండు పులులకు ఒకే చారలు ఉండవు. ఇదంతా శిక్షణలో సిబ్బంది వివరిస్తారు.

మైదాన ప్రాంతాలకు వచ్చే వన్యప్రాణులకు..

అటవీ ప్రాంతంలో తాగు నీరు దొరకక కొన్ని వన్యప్రాణులు అడవిలో నుంచి మైదాన ప్రాంతాలకు వస్తాయి. అలాగే కొన్నిచోట్ల బెదిరి బయటి ప్రాంతాలకు వస్తాయి. అవి పంట పొలాలను నాశనం చేయడం, ప్రజలకు కీడు చేయడం వంటి చర్యలు చేస్తాయి. వాటి సమాచారం అటవీ అధికారులకు అందిస్తే వాటి కోసం శిక్షణ పొందిన రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి వెళతారు. వాటిని వలలు, బోనుల ద్వారా పట్టుకుంటారు. పులులు, చిరుతలు అయితే వాటికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకుని బోనుల్లో తీసుకుని వెళ్లి అడవిలో వదిలిపెడతారు. ఇలా పలు అంశాలపై శిక్షణలో ఉన్న ఉద్యోగులకు అటవీ అధికారులకు అవగాహన కల్పిస్తారు.

అభయారణ్యంలోని పులిచెరువు

కెమెరా ట్రాప్‌ల గురించి శిక్షణ ఉద్యోగులకు వివరిస్తున్న ఏబీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని