logo

ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి

ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆదివారం వై.పాలెం పంచాయతీ కార్యాలయం ఆవరణలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పంచాయతీ కార్మికులకు రిక్షాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

Published : 24 Jan 2022 05:19 IST

మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆదివారం వై.పాలెం పంచాయతీ కార్యాలయం ఆవరణలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పంచాయతీ కార్మికులకు రిక్షాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య మనస్పర్థలున్నా అవి తాత్కాలికమేనన్నారు. ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం వారికి మేలు చేస్తుందని తెలిపారు. సచివాలయాల వ్యవస్థతో పరిపాలన గ్రామస్థాయికి తెచ్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరవలేనివన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ చేశారు. స్వయంగా రిక్షా తొక్కి మంత్రి సందడి చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం...

ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మండలంలోని కాశీకుంట, వై.పాలెం, గురిజేపల్లెలో రూ.40 లక్షల చొప్పున వెచ్చించి నిర్మించిన సచివాలయ భవనాలను ప్రారంభించారు. వై.పాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.30 లక్షలతో నిర్మించిన ప్రయాణికుల ప్రాంగణం, రూ.15 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం నాలుగో తరగతి ఉద్యోగుల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జి.వి.నారాయణరెడ్డి, ఎంపీడీవో సాయికుమార్‌, తహసీల్దార్‌ వీరయ్య, ఏఎంసీ ఛైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌, సర్పంచి అరుణాబాయి, సొసైటీ డైరెక్టర్‌ ఎం.బాలగురవయ్య, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని