logo

కిరాతకుడు దొరికాడు

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో రెండు హత్యలు చేసి వెనువెంటనే ఒంగోలు వచ్చి ఒకరిపై హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్‌ రబ్బానీని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు చెప్పారు. తన కార్యాలయంలో ఆదివారం

Published : 24 Jan 2022 05:19 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు, చిత్రంలో

ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలెంలో రెండు హత్యలు చేసి వెనువెంటనే ఒంగోలు వచ్చి ఒకరిపై హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్‌ రబ్బానీని అరెస్టు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు చెప్పారు. తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన రబ్బానీ, అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న తమ సమీప బంధువు నూర్జహాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్నారు. ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఓ ఇంటిలో ఆమెతో సహజీవనం చేస్తూ అరవై అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహించేవాడని తెలిపారు. అయితే అక్కడ టీ మాస్టర్‌గా చేరిన మండ్లా కాశీరావు, నూర్జహాన్‌తో సన్నిహితంగా ఉంటూ కొన్నాళ్ల క్రితం వారిద్దరూ కలిసి వెళ్లిపోయారన్నారు. నూర్జహాన్‌ తనను విడిచివెళ్లడానికి కాశీరావుతో పాటు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అంబటివారిపాలేనికి చెందిన నూర్జహాన్‌ వదిన మీరాంబి, ఆమె కుమారుడు అక్బర్‌ ఆలీఫ్‌ కారణమని రబ్బానీ వారిపై పగ పెంచుకున్నాడని తెలిపారు. దీంతో ఈ నెల 22వ తేదీన ఉదయం తొమ్మిది గంటల సమయంలో అంబటివారిపాలెంలో మీరాంబి, ఆమె కుమారుడిని దారుణంగా హతమార్చినట్లు చెప్పారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఒంగోలు వచ్చి గుంటూరు రోడ్డులో మాటువేసి కాశీరావు పైనా కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. కేసులో నిందితుడు రబ్బానీని తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, సిబ్బందితో కలిసి అరెస్టు చేశారని తెలిపారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వివరించారు. సకాలంలో నిందితుడిని అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని