logo

పశువుల మేతకూ ముకుతాడు..

ఇప్పటివరకు పశు దాణా తయారీ యూనిట్ల నిర్వహణ.. విక్రయాలతో పలువురు ఉపాధి పొందుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ తన ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో పశు దాణా విక్రయాల పైనా ఫీడ్‌ యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ

Published : 25 Jan 2022 03:28 IST

 దాణా తయారీ, విక్రయాలకు అనుమతి తప్పనిసరి 
 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్న ఫీడ్‌ యాక్ట్‌


దుకాణ నిర్వాహకులకు నోటీసులు అందజేస్తున్న పశు సంవర్ధక శాఖ అధికారులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే ఇప్పటివరకు పశు దాణా తయారీ యూనిట్ల నిర్వహణ.. విక్రయాలతో పలువురు ఉపాధి పొందుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ తన ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో పశు దాణా విక్రయాల పైనా ఫీడ్‌ యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తయారీ, పంపిణీ, అమ్మకందారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి నెల నుంచి చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో పశు దాణా విక్రేతలందరూ ఈ నెలాఖరులోపు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అక్కడ నిల్వలను సీజ్‌ చేయనున్నారు. 
230 మందికి నోటీసుల జారీ...:  జిల్లాలో 9,31,852 గేదెలు; 68,373 ఆవులున్నాయి. దాణా విక్రయాలకు సంబంధించి అనుమతులు తప్పనిసరి చేయడంతో సంబంధిత అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పాతర గడ్డి, దాణా మిశ్రమం, దాణామృతం వంటి పశువుల మేతకు సంబంధించి క్రయ, విక్రయాలు చేస్తున్న వారి వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇద్దరు పశు దాణా తయారీదారులు, ఇద్దరు పంపిణీదారులతో పాటు, 230 మంది మందుల దుకాణాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 
టన్నులకొద్దీ భారం...: దుకాణాల్లో లవణ మిశ్రమంతో పాటు, కాల్షియం, ఇతర ద్రావణం.. మరికొందరు కుక్కలు, పిల్లుల దాణా విక్రయిస్తున్నారు. ఏడాదికి 25 వేల టన్నుల్లోపు దాణా అమ్మకం సాగించేవారు రూ.25 వేలు; 50 వేల టన్నుల్లోపు విక్రయించేవారు రూ.50 వేలు; 50 వేల టన్నులు లేదా అంతకంటే ఎక్కువ అమ్మేవారు రూ.75 వేలు చెల్లించాలి. దుకాణ నిర్వహణ అనుమతులు కావాల్సిన వ్యక్తులు సమీప రైతు భరోసా కేంద్రంలో నగదు చెల్లిస్తే అక్కడి నుంచి పశు సంవర్ధక శాఖ జేడీ లాగిన్‌లో అప్‌లోడ్‌ అవుతుంది. ఆ తర్వాత కార్యాలయం నుంచి అనుమతుల పేరిట ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. పశు దాణా తయారీ యూనిట్ల నిర్వాహకులైతే.. 50 వేల టన్నుల్లోపు ఉత్పత్తి చేస్తే రూ.75 వేలు; 99 వేల టన్నుల్లోపైతే రూ.1.25 లక్షలు; లక్ష టన్నులకు మించితే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి సంబంధిత రుసుం పశుసంవర్ధకశాఖకు జమ చేస్తే జీవిత కాలం పనిచేసేలా సంయుక్త సంచాలకులు లైసెన్స్‌ జారీ చేయనున్నారు. 

పట్టుకుంటే జరిమానాల మోత!
అనుమతులు పొందిన తర్వాత యూనిట్‌ను ఎప్పుడైనా సంబంధిత అధికారులు తనిఖీ చేసే అధికారం ఉంది. విక్రయ కేంద్రాల ద్వారా సమూనాలు సేకరించి నాణ్యతా ప్రమాణాలు కూడా పరిశీలిస్తారు. నిబంధనల మేరకు నాణ్యత లోపించిన దుకాణ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫీడ్‌ యాక్ట్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో అనుమతులు లేకుండా పశువుల దాణా విక్రయిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏ రంగంలోనైనా పన్నుల రూపంలో వ్యాపారులపై పడే భారం మొత్తాన్ని వినియోగదారుడిపై మోపుతారు. ఈ క్రమంలో పశుపోషకుల పైనే ప్రస్తుత ఆర్థిక భారమూ పడనుంది. ప్రభుత్వానికి చెల్లించే రుసుముతో పాటు, ఇతర ఖర్చులను కలిపి పశు దాణాపై వేయనుండటం వల్ల ధరలూ పెరుగుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అనుమతులు పొందాల్సిందే... 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశు దాణా అమ్మేవారు ఈ నెలాఖరులోపు నిర్ణీత రుసుము చెల్లించి అనుమతులు పొందాలి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫీడ్‌ యాక్ట్‌ అమల్లోకి రానుంది. ఆ తర్వాత అనుమతులు లేకుండా పశు దాణా విక్రయిస్తున్నట్టు తేలితే రూ.5 లక్షల వరకు జరిమానాలు విధిస్తాం. అక్కడ నిల్వ ఉన్న దాణానూ సీజ్‌ చేస్తాం. 
- కాలేషా, డీడీ, పశు సంవర్ధక శాఖ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని