logo

రోజు రోజుకూ వైరస్ ఉద్ధృతం

కరోనా వైరస్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతమవుతోంది. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలనూ చుట్టుముడుతోంది. మూడో విడత కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐఏఎస్‌ల నుంచి అటెండర్ల వరకు పలువురు

Published : 25 Jan 2022 03:28 IST

 చుట్టుముడుతున్న మహమ్మారి 
 పోలీసు శాఖ, పాఠశాలల్లోనూ కలకలం


పర్చూరు మండలం వీరన్నపాలెంలోని ఓ వీధిలో ఏర్పాటు చేసిన కట్టడి జోన్‌

ఒంగోలు నేరవిభాగం, ఒంగోలు నగరం- న్యూస్‌టుడే కరోనా వైరస్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతమవుతోంది. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలనూ చుట్టుముడుతోంది. మూడో విడత కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐఏఎస్‌ల నుంచి అటెండర్ల వరకు పలువురు అధికారులు, ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలోనూ కలకలం రేపుతోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. వ్యాప్తి చెందకుండా పోలీసు స్టేషన్లతో పాటు కార్యాలయాల వద్ద పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. పలువురు వైరస్‌ బారిన పడుతుండటం అధికారులు, సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తోంది. 
స్పందనకు అంతరాయం...
వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉండటంతో జిల్లా పోలీసు కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ముఖాముఖిగా కాకుండా వర్చువల్‌ విధానానికి ఇప్పటికే మార్చారు. ఈ సోమవారం ఆ కార్యక్రమం కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. సబ్‌ డివిజన్‌ కేంద్రాల నుంచి డీఎస్పీలు, జిల్లా కేంద్రంలో సీఐ ఒకరు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
150 మంది వరకు బాధితులు...
జిల్లాలో ఇప్పటికి సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. వీరితో పాటు పోలీసు కుటుంబాల నుంచి సుమారు 60 మందికి పైగా వైరస్‌ సోకింది. గ్రామ, వార్డు స్థాయిలో పనిచేస్తున్న మహిళా పోలీసులు సుమారు 25 మంది వైరస్‌ బారినపడ్డారు. కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మరికొందరు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడుతూ.. ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. ఈపాటికే జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ద్వారా బాధితుల వివరాలు సేకరించి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 


చీరాల ఏరియా ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది 

89 మంది ఉపాధ్యాయులు.. 9 మంది విద్యార్థులు...
జిల్లాలో సోమవారం 1597 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒంగోలులో 432, అద్దంకిలో 180, మార్టూరులో 75 కేసులు వెలుగుచూశాయి. దీంతో 7504 మంది వ్యాధితో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 89 మంది ఉపాధ్యాయులు, 9 మంది విద్యార్థులు, 86 మంది బోధనేతర సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. పాఠశాలల్లో ఒక్కరోజులోనే 184 కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

ఒంగోలు ఆర్డీవో, ఎస్‌డీసీకు కరోనా 
ఒంగోలు గ్రామీణం: ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డితో పాటు, ఆయన కారు డ్రైవర్‌ కోటిరెడ్డి, సహాయకుడు కొండయ్య, కార్యాలయంలోని ఉప తహసీల్దార్‌ మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ మేరి కరోనా బారిన పడ్డారు. కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ ఎం.శ్రీదేవికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరూ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.   

కొవిడ్‌ ఆర్థిక సాయానికి దరఖాస్తులివ్వాలి 
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది. ఇందులో భాగంగా ఇంకా ఎవరికైనా సాయం అందకుంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కోరారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి కలెక్టరేట్‌లోని కొవిడ్‌ కంట్రోల్‌ రూం లేదా తహసీల్దార్‌ కార్యాలయంలోనైనా స్వయంగా ఇవ్వాలని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని