logo

పేరంగుడిపల్లి.. కన్నీట మునిగి..

ఆ ఇద్దరు విద్యార్థులు అప్పటి వరకు గణతంత్ర వేడుకల్లో తోటి వారితో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లారు. అనంతరం మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు సరదాగా వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోని బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 27 Jan 2022 06:24 IST

ఈతకు వెళ్లి ఇద్దరు బాలుర మృతి


లోకేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి భాగ్యమ్మ, బంధువులు

కనిగిరి, న్యూస్‌టుడే: ఆ ఇద్దరు విద్యార్థులు అప్పటి వరకు గణతంత్ర వేడుకల్లో తోటి వారితో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంటికెళ్లారు. అనంతరం మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు సరదాగా వెళ్లారు. ఈ క్రమంలో నీటిలోని బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది.

వేడుకల్లో ఆనందంగా...: పేరంగుడిపల్లి సర్పంచి ఇండ్లా సుజాత, మాలకొండరాయుడు దంపతుల కుమారుడు దినేష్‌(14). అదే గ్రామానికి చెంది ఇండ్లా శ్రీనివాసులు, భాగ్యమ్మల కుమారుడు లోకేష్‌(14). వీరిద్దరూ వరుసకు సోదరులు. కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఉదయాన్నే హాజరయ్యారు. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు అవసరమైన మట్టి కోసం ఆ గ్రామ సమీపంలో పెద్ద గోతులు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచింది. తరగతులు లేకపోవడంతో మరికొందరితో కలిసి ఈత నేర్చుకునేందుకు గోతుల వద్దకు వెళ్లారు.

బురదలో చిక్కుకుని.. బయటికి రాలేక...: దినేష్‌, లోకేష్‌ కొద్దిసేపు తక్కువ లోతు ఉన్న ప్రదేశంలో ఈత కొట్టారు. కొద్దిసేపటి తర్వాత లోకేష్‌ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగి పోసాగాడు. విషయాన్ని గమనించిన దినేష్‌ అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. బురదలో కాళ్లు కూరుకుపోవడంతో బయటికి రాలేకోయాడు. ఈ క్రమంలో దినేష్‌ కూడా నీటిలో పడిపోయాడు. విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న మరి కొందరు విద్యార్థులు సమీపంలోని తోటల్లో ఉన్న వారికి చెప్పారు. వారు అక్కడికి చేరుకుని విద్యార్థులను బయటికి తీశారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఏఎస్సై ముల్లా అహ్మద్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దినేష్‌, లోకేష్‌(పాత చిత్రాలు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని