logo

చీరాలకు మేలు... అద్దంకికి భారం!

బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఖరారైంది. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు అందులో భాగం కానున్నాయి. ఈ క్రమంలో చీరాలలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కావడంతో పాటు... ఆ ప్రాంత అభివృద్ధికి ఊతం లభించనుంది. పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ఇటు ఒంగోలు... అటు బాపట్ల అందుబాటు

Published : 27 Jan 2022 06:24 IST

బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో మారనున్న పరిస్థితి


చీరాల పట్టణ ముఖచిత్రం

బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఖరారైంది. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు అందులో భాగం కానున్నాయి. ఈ క్రమంలో చీరాలలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కావడంతో పాటు... ఆ ప్రాంత అభివృద్ధికి ఊతం లభించనుంది. పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ఇటు ఒంగోలు... అటు బాపట్ల అందుబాటులో ఉండే ప్రాంతాలే కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్ఛు అద్దంకి వాసులకు మాత్రం కొత్త జిల్లా కేంద్రం దూరాభారం కానుంది. ఇప్పటి వరకు ఈ రెండు ప్రాంతాలకు నేరుగా రవాణా సౌకర్యం, ఇతరత్రా సంబంధాలు లేకపోవడం గమనార్హం.

కొత్త జిల్లాకు సంబంధించి చీరాలలో నూతన రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఈ డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న ఈ రెవెన్యూ డివిజన్‌లో చీరాలతో పాటు... పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 13 మండలాలకు ఇక్కడి నుంచే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం చీరాల వాసులు ఈ పనుల నిమిత్తం ఒంగోలు వెళ్లి, వచ్చేందుకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొత్త డివిజన్‌ ఏర్పాటుతో ఈ భారం తొలగనుంది. మండల స్థాయిలో పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలతో పాటు... మొత్తం 19 రకాల సేవలు డివిజన్‌ కేంద్రంలో అందుబాటులోకి వస్తాయి.

అభివృద్ధికి ఊతం...

వస్త్ర వ్యాపారానికి కేంద్ర బిందువు చీరాల. అందుకే చిన ముంబయిగా పేరొందింది. బులియన్‌ వ్యాపారంతో పాటు... ఇతర వాణిజ్య కార్యకలాపాలూ ఎక్కువే. కార్పొరేట్‌ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ కారణంగానే వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. విశాలమైన సముద్ర తీర ప్రాంతం మరో ఆకర్షణ. తెలంగాణాతో పాటు... పరిసర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో వీటి ప్రాధాన్యం మరింత పెరగనుంది. ప్రభుత్వ కార్యాలయాలూ ఏర్పాటవుతాయి. ఇతరత్రా రంగాలూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

చీరాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని... జిల్లా సాధన సమితి ప్రతినిధులు కొన్నాళ్లు ఆందోళనలు చేపట్టారు. వాణిజ్యకేంద్రం కావడంతో పాటు... అందరికీ అందుబాటులో ఉంటుందని వాదన వినిపించారు. కొత్త జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలన్న డిమాండ్‌ కూడా ఉంది.

న్యూస్‌టుడే, చీరాల గ్రామీణం, అద్దంకి : చారిత్రక నేపథ్యం కలిగిన అద్దంకి ప్రాంతాన్ని బాపట్ల జిల్లాలో కలిపితే ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు తప్పవని స్థానిక సాంస్కృతిక, కళారంగ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండడం తప్ఫ.. ఇతరత్రాల పరంగా ఎటువంటి సంబంధం లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. నేరుగా రవాణా సౌకర్యం కూడా లేదని వివరిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఇటు మార్టూరు లేదంటే అటు ఇంకొల్లు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత జిల్లా కేంద్రం ఒంగోలు 37 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రతి అయిదు నిమిషాలకు ఓ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. వివిధ రంగాల పరంగా చూసినా అద్దంకి, ఒంగోలు మధ్య సారూప్యతలు ఉన్నాయి. అదే బాపట్ల అయితే అద్దంకికి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరైన రోడ్డు మార్గం... నేరుగా బస్సులు కానీ లేవు. దీంతో వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లి రావడం దూరాభారమవుతుందని వివరిస్తున్నారు. చారిత్రక నేపథ్యమూ మసకబారే అవకాశం ఉందని చారిత్రక పరిశోధకులు విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి పేర్కొన్నారు.

అద్దంకిలోని కమఠేశ్వరాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని