logo

ఒక్క ప్రసవమూ లేదు

వైద్య ఆరోగ్యశాఖలో మాతాశిశు సంరక్షణ అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. గర్భిణుల నమోదు, ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, సురక్షిత ప్రసవం.. తల్లీబిడ్డల ఆరోగ్య పర్యవేక్షణ ఇలా అన్ని దశల్లో కంటికి రెప్పలా చూడాలి. క్షేత్రస్థాయిలో ఇది నీరుకారిపోతోంది.

Published : 20 May 2022 02:02 IST

17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇదీ పరిస్థితి

* వైద్యులు, సిబ్బంది చొరవ చూపినచోట ప్రైవేటుతో సమానంగా ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఉదా: త్రిపురాంతకం పీహెచ్‌సీలో అత్యధికంగా 119, తరువాత పుల్లలచెరువులో 98, సీఎస్‌ పురంలో 89 జరిగాయి.

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్యశాఖలో మాతాశిశు సంరక్షణ అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. గర్భిణుల నమోదు, ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, సురక్షిత ప్రసవం.. తల్లీబిడ్డల ఆరోగ్య పర్యవేక్షణ ఇలా అన్ని దశల్లో కంటికి రెప్పలా చూడాలి. క్షేత్రస్థాయిలో ఇది నీరుకారిపోతోంది. ఫలితంగా పేద, మధ్యతరగతి వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి బిల్లులు చెల్లించలేక అప్పులపాలు కావాల్సి వస్తోంది. గతంలో పీహెచ్‌సీలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసేవి. ఇప్పుడు 24 గంటలూ సేవలందించేలా ఏర్పాట్లు చేశారు. ఇద్దరేసి వైద్యులను నియమించారు. స్టాఫ్‌నర్సుల పోస్టులు భర్తీ చేశారు. ఇన్ని చేసినా వైద్యసేవల్లో ప్రగతి కానరావడంలేదు. 
ఉమ్మడి ప్రకాశంలో 90 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 25 పట్టణ ఆరోగ్యకేంద్రాలున్నాయి. మార్చి 1 నుంచి మరుసటి ఏడాది మార్చి ఆఖరు వరకు ప్రసవాల లక్ష్యాలు నిర్దేశిస్తుంటారు. ప్రతి కేంద్రంలో ఏడాదికి పదికి తగ్గకుండా చేయాల్సి ఉంది. అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షలో వైద్యసిబ్బంది డొల్లతనం బయటపడింది. 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాది మొత్తంలో ఒక్క ప్రసవం కూడా జరగలేదు. 9 కేంద్రాల్లో ఒక్కొక్కటి, మరో 9 కేంద్రాల్లో రెండు చొప్పున మాత్రమే జరిగాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏడాదిలో 50 నుంచి 70 మధ్య ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. జిల్లా మొత్తంలో అన్ని ఆసుపత్రుల్లో కలిపి 32 వేల నుంచి 36 వేలు నమోదవుతున్నాయి. వీటిలో ప్రభుత్వ ఆసుపత్రుల వాటా 20 శాతం లోపే. పీహెచ్‌సీల వరకు చూస్తే ఈ ఏడాది మార్చి వరకు 1313 ప్రసవాలు మాత్రమే జరిగాయి. కొంతమంది ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగినవి కూడా పీహెచ్‌సీల లెక్కల్లో చూపిస్తున్నట్లు సమాచారం. 
వైద్యులు ఉన్నా సరే..
పాలుట్ల, మోదేపల్లి, ప్రాసంగులపాడు, వేములపాడు, పందిళ్లపల్లి, సంతరావూరు, తిమ్మసముద్రం, ద్రోణాదుల, కరవది, పోతవరం, స్వర్ణ, చందలూరు, నాగిరెడ్డిపల్లి, గొట్లగట్టు, అన్నసముద్రం, ముటుకుల కేంద్రాల్లో వైద్యులు ఉన్నా ఏడాదిలో ఒక్క ప్రసవం కూడా జరగలేదు. పెద్దాసుపత్రులు సమీపంలో ఉన్నచోట పీహెచ్‌సీల్లో ప్రసవాలకు ఆసక్తి చూపడంలేదు. ఉదా: వేములపాడు, నూతలపాడు, కరవది కేంద్రాలు ఈ కోవలోకే వస్తాయి.. అన్ని ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసినందున ప్రసూతి మహిళలకు, వైద్యులకు ప్రోత్సాహకాలు వస్తాయి. అయినప్పటికి చాలాచోట్ల సిబ్బంది ఆసక్తి చూపడంలేదు. కమ్యూనిటీ ఆసుపత్రిగా ఉన్న చీమకుర్తి కేంద్రంలో 12 మంది వైద్యులు, పూర్తిస్థాయి సౌకర్యాలు, సిబ్బంది ఉన్నా అక్కడ ఏడాదిలో అయిదు ప్రసవాలు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని