logo

పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి వేధింపులు

వివాహిత అదృశ్యం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు గత కొద్ది రోజులుగా తరచూ స్టేషన్‌కి పిలిచి వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ సంఘటన గురువారం మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం

Published : 20 May 2022 02:02 IST

 మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మార్కాపురం గడియార స్తంభం న్యూస్‌టుడే : వివాహిత అదృశ్యం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు గత కొద్ది రోజులుగా తరచూ స్టేషన్‌కి పిలిచి వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతమిది. ఈ సంఘటన గురువారం మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం మండలం ఏబీఎంపాలేనికి చెందిన ఎ.లక్ష్మీ, సుదర్శన్‌ దంపతుల కుమారై శ్రావణి(21)కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదంటూ లక్ష్మీ ఏప్రిల్‌లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పదిరోజుల్లో ఆచూకీ కనిపెట్టాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశించడంతో దర్యాప్తులో వేగం పెంచారు. పలువురిని స్టేషన్‌కి పిలిచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన కొల్లా రాజు(35)ను కొద్ది రోజులుగా విచారణ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కాపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంచుతున్నారు. తరచూ నంద్యాలకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో మార్కాపురం సమీప రాయవరంలోని సమీప బంధువుల ఇంట్లో రాజు దంపతులు ఉంటున్నారు. గురువారం పట్టణంలోని తర్లుపాడు రహదారి శివారు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును రాజు తాగేశారు. భార్య వెంటనే 108కి చేయగా వారు ఘటనా స్థలానికి చేరుకొని రాజును ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఒంగోలు రిమ్స్‌కు తరలించాలని సూచించారు. దీంతో ఇదే కేసులో అదుపులో ఉన్న మరికొందరు అనుమానితులను పోలీసులు వెంటనే పంపించి వేశారు. మార్కాపురం సీఐ ఆంజనేయరెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా రాజును కేసు దర్యాప్తులో భాగంగా మాత్రమే స్టేషన్‌కి పిలిపించి, పెద్దమనుషుల సమక్షంలో విచారిస్తున్నామన్నారు. ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని... వారి ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని