logo

మింగేసిన అలలు

వారంతా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. గురువారం పరీక్షలు ముగియడంతో ఆనందంగా సముద్ర తీరానికి వెళ్లారు. అందరూ కలిసి స్నానాలు చేస్తున్నవేళ అలల ధాటికి ఉక్కిరిబిక్కిరై ఓ విద్యార్థి మృతిచెందగా.. మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు.

Published : 20 May 2022 02:02 IST

 సముద్రంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి 
 మరొకరిని కాపాడిన పోలీసులు


ఓ విద్యార్థిని రక్షించి సపర్యలు చేస్తున్న మెరైన్‌ సిబ్బంది

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: వారంతా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. గురువారం పరీక్షలు ముగియడంతో ఆనందంగా సముద్ర తీరానికి వెళ్లారు. అందరూ కలిసి స్నానాలు చేస్తున్నవేళ అలల ధాటికి ఉక్కిరిబిక్కిరై ఓ విద్యార్థి మృతిచెందగా.. మరొకరిని మెరైన్‌ పోలీసులు కాపాడారు. సింగరాయకొండ మండలం పాకల తీరం వద్ద చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కందుకూరులోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు గురువారం పాకల ప్రాంతానికి వచ్చారు. సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో వంతెన సమీపంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలో కందుకూరుకు చెందిన పలవెళ్ల హేమంత్‌రెడ్డి(17), గుడ్లూరుకు చెందిన మౌనగిరి చరణ్‌సాయి అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో సహ విద్యార్థులు కేకలు వేశారు. మెరైన్‌ సిబ్బంది రంగంలోకి దిగి వారిని ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. చరణ్‌ కోలుకోగా హేమంత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పంచనామా నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. 
ఆసరా ఉంటాడనుకుంటే.. కందుకూరు ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాసరెడ్డి దంపతులకు కుమారుడు హేమంత్‌రెడ్డితోపాటు కుమార్తె ఉన్నారు. గురువారం పరీక్షలు ముగిసిన వెంటనే హేమంత్‌ ఇంటికి వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహితులతో సినిమాకు వెళ్లి వస్తానని బయలుదేరాడని.. ఇంతలోనే మరణ వార్త వినాల్సి వచ్చిందని వారు రోదించారు. కష్టపడి చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడని కలలు కన్నామని.. అర్ధంతరంగా దూరమయ్యాడంటూ వారు విలవిల్లాడారు. 


హేమంత్‌రెడ్డి (పాతచిత్రం) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని