logo
Published : 21 May 2022 06:30 IST

పశ్చిమం గొంతెండుతోంది !

 తాగునీరు లేక పల్లెలు విలవిల 
 మరమ్మతులకు నోచని రక్షిత పథకాలు


హెచ్‌ఎంపాడులో బోరు వద్ద క్యూ కట్టిన మహిళలు

సహజ సిద్ధంగా లభ్యమవ్వాల్సిన నీటిని ఆ ప్రాంతాల్లో నిత్యం కొనుగోలు చేయాల్సి వస్తోంది.. ఓ వైపు అన్ని ధరలు, ఛార్జీలు పెరిగి సతమతమవుతున్న ప్రజలు నెలనెలా నీటి కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాల్సిన పరిస్థితి. పశ్చిమ ప్రకాశంలోని అనేక పల్లెల్లో నెలకొన్న దురావస్థ ఇది. 

ఈనాడు డిజిటల్, ఒంగోలు జిల్లాలోని అనేక రక్షిత పథకాలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడంలేదు. నిర్వహణ అసలు కానరాదు. చూస్తుండగానే నిరుపయోగంగా మారుతున్నవాటికి కొదవలేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌) గణాంకాల ప్రకారం ఉమ్మడి ప్రకాశంలో మంచినీటి సరఫరా పథకాలు, చేతి పంపులు కలిపి 28 వేలు ఉండగా దాదాపు 8 వేల వరకు నిరుపయోగంగా మారాయి. మరో 20 వేలు పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి. ట్యాంకర్లు రాకుంటే బోరుబావులు, క్యాన్లు ఆధారమవుతున్నాయి. 
ఏళ్లుగా అవే ఆధారం..
మార్కాపురం నియోజకవర్గంలోని చినారికట్ల, పెదారికట్ల, బచ్చలకూరపాడు, ఇరసలగుండం గ్రామాలకు తాగునీరు అందించే పథకం కొన్నేళ్లుగా పనిచేయడంలేదు. చేతిపంపులు సైతం మరమ్మతులకు గురవడంతో వందలాది కుటుంబాలు బోరుబావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాయి.. నిధుల లేమి పేరుతో పథకాలను బాగుచేయడంలేదు. స్థానికంగా ఉండే ఆర్వోప్లాంటు నుంచి ఒక నీటి క్యాను రూ.10 చొప్పున కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. అదే ఇంటికి తెచ్చిస్తే రూ.15 చెల్లించాలి. నెలకు ఒక్కో కుటుంబానికి రూ.300 నుంచి రూ.500 వరకు భారం పడుతోంది. సింగిల్‌ ఫేజ్‌ మోటార్లతో పనిచేసే మినీ ట్యాంకులు ఉన్నప్పటికీ వాటి ద్వారా అరగంట వరకే నీళ్లు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. 
కుళాయిలు ఉన్నా చుక్క రాదు...
పెద్దారవీడు మండలంలోని బోయదగుంపులలో 2800 మంది జనాభా ఉన్నారు. రక్షిత తాగునీటి పథకం లేదు. గ్రామంలో సింగిల్‌ ఫేజ్‌ మోటార్ల ద్వారా నీటి సరఫరా కోసం 2017లో ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటుచేసినా సరఫరా మాత్రం జరగడంలేదు. దీంతో తాగునీటి అవసరాలకు ట్యాంకర్ల నీటినే వినియోగిస్తున్నారు. కొందరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపల్లి గ్రామం నుంచి క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. చేతి పంపులు సైతం పనిచేయడంలేదు. వేసవి సందర్భంగా కొత్త బోర్లువేయలేదు. నిత్యం 40 ట్యాంకుల నీళ్లు అవసరంకాగా 26 ట్యాంకులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 


నిరుపయోగంగా ట్యాంకు 

బాబోయ్‌.. ఫ్లోరైడ్‌
కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడులో 3 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మంచినీటి పథకం ఉంది. దీని పరిధిలోని పది బోర్లలో 8 పనిచేయవు. వాటి మరమ్మతులకు నిధులు లేక, అధికారులు పట్టించుకోక ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.. కొత్త బోర్లువేయక, పాతవి మరమ్మతులు చేయక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. రెండుబోర్లు పని చేసినప్పటికీ ఫ్లోరైడ్‌ కారణంగా తాగడానికి పనికిరావని, రోజుకు 30ట్యాంకర్ల నీరు అవసరంకాగా సరఫరా చేయడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఇక పశువులకు నీళ్లు సమకూర్చుకోలేక కొందరు విక్రయిస్తున్నారు.

సరఫరాకే నెలకు రూ.42 లక్షలు

పుల్లలచెరువు మండలం ముటుకులలో 2009లో వేసవి రక్షిత తాగునీటి పథకం నిర్మించారు. దీనినుంచి త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని 44 గ్రామాలకు నీటి సరఫరా లక్ష్యం. పైపులైన్లు సరిగా లేకపోవడంతో నిర్మించినప్పటి నుంచే పథకం నిరుపయోగంగా మారింది. దీనికింద సరఫరా చేయాల్సిన గ్రామాల్లో రోజుకు 350 ట్యాంకర్ల నీళ్లు అందిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఒక్కో ట్యాంకుకు రూ.400 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.42 లక్షలు ఖర్చవుతోంది. ఒక్క ముటుకుల గ్రామమే తీసుకుంటే రోజుకు 30 ట్రిప్పుల చొప్పున ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ఏడాదికి రూ.20 లక్షలు వెచ్చిస్తున్నారు. మానేపల్లిలో ఫ్లోరైడ్‌ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ 2 వేలమంది జనాభా ఉండగా 4 కిలోమీటర్ల దూరంలోని పొలాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. 


ముటుకులలో ట్యాంకర్‌ వద్ద నీళ్లు పట్టుకుంటున్న స్థానికులు 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని