logo
Published : 21 May 2022 06:30 IST

చివరి ఆయకట్టుకూ నీరందేలా చర్యలు

 వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి మేరుగ


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున.. చిత్రంలో పురపాలకశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్‌ దినేష్‌కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ,
ఎంపీ మాగుంట, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ తదితరులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో చివరి ఆయకట్టు భూమి వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున సూచించారు. ప్రకాశం భవన్‌లో శుక్రవారం జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఏడాది సాగునీరును ముందుగానే జులై 15న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకనుగుణంగా నీటి పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు. పిచ్చి మొక్కల తొలగింపు, కాలువ మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సాగునీరు ఏ రోజుల్లో, ఎంత మొత్తంలో, ఏ ప్రాంతానికి విడుదల చేయాలో ప్రణాళిక రూపొందించాలన్నారు. పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్ధంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.  రైతు భరోసా కేంద్రాలను త్వరగా పూర్తి చేయడంపైనా దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ కింద 2,59,410 ఎకరాలు, మధ్యస్థాయి నీటి వనరులైన మోపాడు ప్రాజెక్ట్‌ కింద 8,174, కంభం చెరువు కింద 6,944, స్వల్పస్థాయి నీటివనరులైన 803 చెరువుల కింద 1,07,726 ఎకరాలు సాగవుతున్నట్లు వివరించారు. సాగర్‌ నీటితో ముందుగా తాగునీటి అవసరాలకు చెరువులను నింపాలని సూచించారు. నాసిరకం విత్తనాలతో మొక్కలు పెంచకుండా నర్సరీలను తనిఖీ చేస్తుండాలన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనూ పంటలు దెబ్బతినకుండా సాగునీరు పంపిణీ చేసేలా ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలన్నారు. ఇటీవల దెబ్బతిన్న చీమకుర్తి-కారుమంచి కాలువ గట్టుకు శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. సమావేశంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్, పీడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, శాస్త్రవేత్త వరప్రసాద్, అధికారులు           పాల్గొన్నారు.    

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని