logo
Updated : 21 May 2022 09:27 IST

ఉత్కంఠగా చీరాల, పర్చూరు పంచాయితీ

 సీఎంను కలిసి వచ్చిన ఆమంచి, బాలినేని

ఈనాడు డిజిటల్, ఒంగోలు: దాదాపు రెండేళ్లుగా అధికారపార్టీకి తలనొప్పిగా మారిన చీరాల వ్యవహారం చివరి అంకానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో 2020లో కరణం వైకాపాకు మద్దతు పలకగా.. ఇదే సమయంలో ఆయన కుమారుడు వెంకటేష్‌ వైకాపాలో చేరారు. అయితే వైకాపా నుంచి పోటీచేసి ఓటమి పాలైన ఆమంచి కృష్ణమోహన్, కరణం మధ్య మాత్రం నువ్వా..నేనా అన్నట్లుగానే రాజకీయాలు కొనసాగుతూ వస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఈ ఇరువర్గాల మధ్యనే పోటీ సాగింది. చీరాల పంచాయితీని తేల్చేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నించినా వీలుపడలేదు. ఆమంచిని పర్చూరుకు పంపే ప్రయత్నాలు జరిగినా ససేమిరా అంటూ ఆయన స్తబ్దుగా ఉంటూ వచ్చారు. ఇటీవల చీరాల ఇన్‌ఛార్జిగా వెంకటేష్, కొండపి ఇన్‌ఛార్జిగా వరికూటి అశోక్‌బాబు, పర్చూరుకు గాదె మధుసూదన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించేలా పార్టీ అధిష్ఠానాన్ని వైకాపా సమన్వయకర్త బాలినేని ఒప్పించారు. గత వారంరోజులుగా వెంకటేష్‌ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతలో పర్చూరు సమన్వయకర్తగా గాదె స్థానంలో ఆమంచికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి పిలుపురావడంతో మూడు రోజుల క్రితం ఆమంచి విజయవాడ వెళ్లి తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జలతోను, అనంతరం సీఎం జగన్‌తో సమావేశమై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇదే సమయంలో బాలినేని ధోరణినీ తెలియజేసినట్లు సమాచారం. ఇక గురువారం బాలినేని కూడా సీఎంను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పులు జరిగాయని.. ఆ వివరాలు దావోస్‌ నుంచి వచ్చిన తర్వాత ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో ఏం తేలనున్నదీ, ఎవరి పంతం నెగ్గుతుందన్నది ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని