logo
Published : 21 May 2022 06:30 IST

ఆమ్మో..అల్లరిమూకల ఆగడాలు

అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు


పాఠశాల ఆవరణలో ధ్వంసమైన కుర్చీలు.. చిందరవందరగా సామగ్రి

మార్కాపురం గడియార స్తంభం, న్యూస్‌టుడే: 2020 సెప్టెంబరు 9న ఇరువర్గాల మధ్య మార్కాపురంలో తలెత్తిన ఆధిపత్య పోరు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ పథకం ప్రకారం చోటుచేసుకున్న ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. జైలు నుంచి విడుదలైన వారిపై ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడిక్కడడే మృతిచెందాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని అల్లరిమూకల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. అల్లర్లకు పాల్పడే కొందరిని గుర్తించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. బైండోవర్‌ కేసులు నమోదు చేసి నిఘా ఉంచారు. దీంతో చాలా వరకు శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. క్రమేణా పట్టు సడలించడంతో మళ్లీ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.
దుకాణం పైనా తెగబడి...: మార్కాపురంలో గురువారం రాత్రి ఇరు వర్గాలకు చెందినవారు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడమే కాకుండా ఒకరిపై సర్జికల్‌ బ్లేడ్‌తో గొంతుపై గాయపరిచే వరకు పరిస్థితి వెళ్లింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటులో దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. దాడి అనంతరం తమకు మత్తుమందులు ఇవ్వాలని ఓ ఔషధ దుకాణ యజమానిని యువకులు కోరడం.. అందుకు నిరాకరించడంతో అతనిపై కూడా దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో దుకాణంలో ఉన్న కుర్చీలు విరగ్గొట్టారు. సామగ్రిని ధ్వంసం చేశారు.
రక్షణగా పెంచి పోషిస్తూ..!: పట్టణంలోని ఓ విలువైన స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్త తన అనుచర గణాన్ని పాఠశాల ఆవరణలోని ఓ గదిలో ఉంచి ఆ స్థలానికి నిత్యం పహారా కాయిస్తున్నారు. ఇలా ఉంటున్న వారితో ఈ ప్రాంతం క్రమేణా అల్లరిమూకలకు అడ్డగా మారుతోంది. వీరి ఆగడాలతో పాఠశాల నిర్వహణ సమయంలో విద్యార్థినులు కూడా అసౌకర్యానికి గురవ్వడం గమనార్హం. వెకిలి చేష్టలతో వారిని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ నిలువరించే సాహసాన్ని అక్కడి బోధన, బోధనేతర సిబ్బంది చేయలేక నిస్సహాయులుగా ఉండిపోయారు.

పాఠశాలే అడ్డాగా ఇష్టారాజ్యం...
పాఠశాలలో ఉంటున్న వారికి తోడు బయట నుంచి ఇతరులూ పదుల సంఖ్యలో అక్కడికి చేరుతున్నారు. మత్తులో ఒకరిపై ఒకరు దాడులు.. ప్రతిదాడులకు తెగబడుతున్నప్పటికీ పట్టించుకున్న వారు లేకపోతున్నారు. ఆర్టీసీ బస్డాండ్‌ వద్ద నుంచి పూలసుబ్బయ్య కాలనీ వరకు.., కళాశాల రహదారి నుంచి పదో వార్డు శివారు ప్రాంతం వరకు అల్లరిమూకలు తమదే రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులు తమకు అప్పు ఇవ్వకున్నా బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాత్రి వేళల్లో సామగ్రిని ధ్వంసం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు గురువారం రాత్రి పాఠశాల ప్రధాన ద్వారం తాళాలు పగులగొడుతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన అతను తన వద్ద సర్జికల్‌ బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో పట్టణానికి చెందిన కందుల మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తికి మెడ భాగంలో గాయమైంది. త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంలో దాడికి పాల్పడ్డ యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కానీ రిమాండ్‌కు తరలించడంలో మీనమేషాలు లెక్కిస్తుండటం శోచనీయం.  

ఇప్పటికైనా మేల్కొంటే మేలు... 
మార్కాపురం పట్టణంలో గతంలో పోలీసు రికార్డుల్లో ఉన్న వారితో పాటు, ఆగడాలకు పాల్పడుతున్న కొత్త వారిపై పోలీసులు ఇప్పటికైనా దృష్టి సాధించాలి. అల్లర్లకు పాల్పడే అసాంఘిక శక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గురువారం చోటుచేసుకున్న దాడిలో గాయపడిన యువకుడు

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts