logo

సహకారం వదిలేసి..అక్రమాలకు తెరతీసి

ఉమ్మడి ప్రకాశంలో 176 సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార(పీఎసీఎస్‌) సంఘాలు కాగా మరికొన్ని ఉద్యోగ సంఘాల క్రెడిట్‌ సొసైటీలు. గుర్తింపు కలిగినవాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు

Published : 22 May 2022 03:06 IST

 అప్పుల ఊబిలో 70 పీఎసీఎస్‌లు 
 ఆడిట్‌లో వెలుగుచూసిన వ్యవహారం


వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ

సభ్యుల మూలధనాన్ని వినియోగించుకొని ప్రభుత్వ సాయంతో సేవలందించాల్సి సహకార సంఘాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రుణాల ఊబిలో కూరుకుపోయాయి.. ఇటీవల సహకార శాఖ నిర్వహించిన 2021-22 వార్షిక ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. ఒకటి రెండు కాదు ఏకంగా 70 సంఘాలదీ ఇదే దుస్థితి. అదే సమయంలో అనేక అక్రమాలూ వెలుగుచూశాయి. 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉమ్మడి ప్రకాశంలో 176 సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార(పీఎసీఎస్‌) సంఘాలు కాగా మరికొన్ని ఉద్యోగ సంఘాల క్రెడిట్‌ సొసైటీలు. గుర్తింపు కలిగినవాటికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తక్కువ వడ్డీకి నిధులిస్తుంది. వాటిని సభ్యులకు రుణాలుగా ఇచ్చి సకాలంలో రికవరీ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. నిబంధనల ప్రకారం నిర్వహిస్తే పరపతి పెరిగి బ్యాంకు రుణాలు ఇతోధికంగా పొందొచ్చు.. నాలుగేళ్లుగా జిల్లాలో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరగలేదు. గడువు మీరినవాటికి ప్రభుత్వం నామినేటెడ్‌ పద్ధతిన త్రిసభ్య కమిటీలను నియమించింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఇవి ఏర్పాటైపోయాయి.
ఆదాయ వనరులివి..
పీఎసీఎస్‌లకు పీడీసీసీ బ్యాంకు అయిదున్నరశాతం వడ్డీ రేటుతో నిధులు కేటాయిస్తుంది. వాటిని రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలుగా ఇస్తారు. అందులో ఒకటిన్నర శాతం వడ్డీ సంఘానికి ఆదాయంగా మిగులుతుంది. సకాలంలో వసూలు చేసి పీడీసీసీబీకి చెల్లిస్తే మరుసటి ఏడాది అంతకన్నా ఎక్కువగా నిధులు పొందొచ్చు. మిగులు ధనం ఉన్న సంఘాలు పంటల కొనుగోలు, దుకాణాల నిర్వహణ, పెట్రోలు బంకుల ఏర్పాటు తదితర వ్యాపారాలపై పెట్టుబడి పెట్టి కమిషన్‌ ద్వారా ఆదాయం సముపార్జించవచ్చు.

వాటిపై ప్రత్యేక నివేదికలు..
సహకారశాఖ చేయించిన ఆడిట్‌లో 70 సొసైటీల్లో అనవసర ఖర్చులు చేసినట్లు గుర్తించారు.. అక్రమాలు ఎక్కువగా ఉన్న మూడింటిపై యాక్టు 51 ప్రకారం విచారణకు అధికారులను నియమించారు. వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ, కారుమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఒంగోలు ఎన్జీవో హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీలపై విచారణ కొనసాగుతోంది. హౌసింగ్‌ సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. 

నిబంధనలకు విరుద్ధంగా..
పీడీసీసీబీ ద్వారా తీసుకున్న నిధులు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం, ఖాతాదారులు కట్టిన సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం వల్ల దాదాపు 70 సంఘాల్లో ఖజానా ఖాళీ అయిపోయింది. జీవోలు 36, 90 హెచ్‌ఆర్‌ పాలసీ ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారిని వీటిలో ఉద్యోగులుగా కొనసాగించకూడదు.. 2019 మార్చి తరువాత కొత్తగా నియామకాలు జరపకూడదు. అయితే 40 సొసైటీల్లో ఒప్పంద పద్ధతిపై నియమించి రుణాల రికవరీ ద్వారా వచ్చిన డబ్బును వారికి వేతనాలుగా చెల్లిస్తున్నారు. త్రిసభ్య కమిటీల విలాసాలు.. రబ్బరు స్టాంపులు, పుస్తకాల కొనుగోలుకు అధిక ఖర్చు చూపి బిల్లులు డ్రాచేయడం వంటి అక్రమాలతో సంఘాలు వట్టిపోయాయి. 

మరికొన్నింటిపై విచారణ
నిబంధనలకు విరుద్ధంగా ఖర్చులు పెట్టిన సంఘాలను ఆడిట్‌లో గుర్తించి నివేదికలు ఇచ్చారు. వాటిలో ప్రస్తుతం మూడింటిపై విచారణ కొనసాగుతోంది. మరో 67 సొసైటీల నివేదికలను పరిశీలించి తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం. కొన్ని సంఘాలు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించి ఆర్థికంగా బలోపేతం అయ్యాయి. సంతమాగులూరు మండలం వెల్లలచెరువు, రావినూతల సొసైటీ ఉదాహరణ. 
- పి.రాజశేఖర్, జిల్లా సహకారశాఖ అధికారి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని