logo

ఎమ్మెల్యే గారూ.. ఎన్నాళ్లీ నీటి కష్టాలు

ఏడాదిగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కనిగిరి నగర పంచాయతీ దేవాంగ్‌నగర్‌ ప్రజలు శనివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాళ్లు, ముళ్ల కంచెలు వేసి..నీటి పాత్రలు చేతబట్టి తమ నిరసన వ్యక్తంచేశారు.

Published : 22 May 2022 03:06 IST

 జాతీయ రహదారిపై ముళ్లకంచెలు వేసి నిరసన


రహదారిపై వాహనాలు తిరగకుండా అడ్డుగా కంచెలు వేసిన దేవాంగ్‌నగర్‌ ప్రజలు 

కనిగిరి, న్యూస్‌టుడే: ఏడాదిగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కనిగిరి నగర పంచాయతీ దేవాంగ్‌నగర్‌ ప్రజలు శనివారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాళ్లు, ముళ్ల కంచెలు వేసి..నీటి పాత్రలు చేతబట్టి తమ నిరసన వ్యక్తంచేశారు. ‘మధుసూదన్‌యాదవ్‌ గారూ.. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుక్కెడు నీటికి ఇబ్బందులు పెట్టడం భావ్యమేనా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికలప్పుడు వచ్చారు.. ఆ తరువాత ఇప్పటివరకు మాకు కనిపించలేదు. తాగునీటి సమస్య తీర్చమని వంద సార్లు నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు, ఛైర్మన్‌కు విన్నవించాం. ట్యాంకరు పంపుతున్నామని చెబుతూ వారు పట్టించుకోవడం లేదు. గత్యంతరం లేక బోర్లలోని ఫ్లోరైడ్‌ నీరు తాగి రోగాల బారిన పడుతున్నాం.’ అని వాపోయారు. తమకు రోజూ పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని, వీధుల్లో మురుగు లేకుండా చేయాలని, సీసీ రోడ్డు వేయాలని డిమాండ్‌ చేస్తూ ఖాళీ బిందెలు, బక్కెట్లతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై అడ్డంగా బైఠాయించడంతో అరగంటకు పైగా జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచి పోయాయి. నగర పంచాయతీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్, పోలీసులతో అక్కడకు చేరుకుని మహిళలతో మాట్లాడారు. ఆందోళన విరమించుకోవాలని కోరారు. ఛైర్మన్‌ నచ్చజెప్పి చివరకు నీళ్లు సరఫరా చేయిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 


ఖాళీ బిందెలు, బక్కెట్లతో నిరసన తెలుపుతూ.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని