logo

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఒంగోలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Published : 22 May 2022 03:06 IST

 రూ.12.50 లక్షల సొత్తు స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌... చిత్రంలో డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఒంగోలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్‌ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలో ఇటీవల జరిగిన చోరీల నేపథ్యంలో యంత్రాంగాన్ని ఎస్పీ అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో, రెండో పట్టణ సీఐ ఎన్‌.రాఘవరావు ఆధ్వర్యంలో నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20న సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో... రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బంగారు ఆభరణాలు లభించటంతో లోతుగా విచారించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా నాగరకట్టె గ్రామానికి చెందిన పురుషోత్తమ, సచిన్, జీవన్, అజయ్, పునీత్‌లుగా గుర్తించారు. ఒంగోలులోని అగ్రహారం గేటు, ఇందుర్తినగర్, ఏలూరు జిల్లా కేంద్రం, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చిక్కజాజూరు గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన 34 సవర్ల (272 గ్రాములు) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పురుషోత్తమ్‌పై ఓ హత్య కేసు కూడా నమోదైంది. నిందితుల అరెస్టు, సొత్తు రికవరీకి కృషి చేసిన అధికారులతో పాటు... ఏఎస్సై బాలాంజనేయులు, హెడ్‌ కానిస్టేబుళ్లు జి.అంకమ్మరావు, డి.నరసయ్య, కానిస్టేబుళ్లు సీహెచ్‌.అంజిబాబు, ఎస్‌డి.చాంద్‌బాషా, ఎస్‌.కిషోర్, ఎన్‌.లక్ష్మీకాంతరావు, ఐటీ కోర్‌టీమ్‌ కానిస్టేబుళ్లు అవినాష్, సురేష్, హోంగార్డులు ఎస్‌.చిరంజీవి, డి.మాధవరావును ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని