logo

ఆశలు ఛిద్రం

ఆ ముగ్గురిదీ ముప్పయ్యేళ్ల లోపు వయసే. కుటుంబాలకు వారే ఆధారం.. గర్భిణి అయిన భార్యను చూసేందుకు వెళ్తూ ఒకరు.. పనిపై బయటకు వెళ్లి వస్తూ మరో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనగా జరిగిన

Published : 24 May 2022 02:20 IST

గిద్దలూరు మోడంపల్లె వద్ద ఘోర ప్రమాదం

ఘటనా స్థలంలో ముగ్గురు యువకుల దుర్మరణం

హనూక్‌ మృతదేహాన్ని చూసి రోదిస్తున్న తల్లి విజయమ్మ, బందువులు

ఆ ముగ్గురిదీ ముప్పయ్యేళ్ల లోపు వయసే. కుటుంబాలకు వారే ఆధారం.. గర్భిణి అయిన భార్యను చూసేందుకు వెళ్తూ ఒకరు.. పనిపై బయటకు వెళ్లి వస్తూ మరో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొనగా జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ చక్రాల కింద నలిగి మిగతావారు విగతజీవులయ్యారు. గిద్దలూరు పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు నగర పంచాయతీ మోడంపల్లె వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గిద్దలూరుకు చెందిన మేరుగ హనూక్‌(28) గర్భిణి అయిన తన భార్యను చూసేందుకు నంద్యాల జిల్లా బిల్లాలపురం ద్విచక్రవాహనంపై బయలు దేరారు. మోడంపల్లె క్రాస్‌ రహదారి వద్ద ఆటోను దాటుతుండగా.. కృష్ణంశెట్టిపల్లె నుంచి ద్విచక్ర వాహనంపై గిద్దలూరు వస్తున్న కొమ్మునూరి ప్రసన్న కుమార్‌(27), శింగరి పెద్ద పీరయ్య(23)లు ముందుగా వెళ్తున్న లారీని అధిగమించే ప్రయత్నించారు. దీంతో ఈ రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. హనూక్‌ రహదారి పక్కన పడిపోయి తలకు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందారు. ప్రసన్నకుమార్, పెద్ద పీరయ్యలు లారీ వెనుకటైర్ల కింద పడటంతో మృతదేహాలు గుర్తించలేని విధంగా ఛిద్రమయ్యాయి. లారీ డ్రైవర్‌ గిద్దలూరు స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని సీఐ ఫిరోజ్, ఎస్సై బ్రహ్మనాయుడు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

భార్యను చూసేందుకు  వెళ్తూ..

ముండ్లపాడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తున్న మోజెస్, విజయమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు హనూక్‌(28). అతనికి వివాహమై భార్య పావని, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం పావని గర్భిణి. బిల్లాలపురంలో ఉన్న ఆమె వద్దకు బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. దీంతో ఇక తమకు దిక్కెవరని, ఎలా బతకాలని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. 

బేల్దారి పని  చేసుకుంటూ 

కృష్ణంశెట్టిపల్లెకే చెందిన శింగరి చిన్న కాశయ్య కుమారుడు పెద్దపీరయ్య(23) తండ్రితో పాటు బేల్దారి పనులకు వెళ్తుంటారు. భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  సోమవారం ఎప్పటిలానే పనికి వెళ్లి ఇంటికి వచ్చారు గిద్దలూరు వెళ్తుండగా మృత్యువు తీసుకెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు తల్లడిల్లారు.

శుభకార్యం  జరగాల్సిన ఇంటిలో..

కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన కొమ్మునూరి దానమ్మ చిన్న కుమారుడు ప్రసన్నకుమార్‌(27). మేనమామ కుమార్తె దీప్తిని ప్రేమ వివాహం చేసుకోగా ఓ కుమార్తె సంతానం. ప్రసన్నకుమార్‌ పెయింటింగ్‌ పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నారు. దీప్తి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొని కంభంలోని కన్నవారింట్లో ఉన్నారు. సోమవారం సాయంత్రం పనికి వెళ్లి వచ్చిన ప్రసన్నకుమార్‌ ఇంటి నుంచి పెద్దపీరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లగా ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చే నెలలో ప్రసన్న అన్న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే చిన్నబిడ్డ మృతిచెందడంతో తల్లి దానమ్మ బోరున విలపించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని