logo

నిప్పుల కొలిమి

అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలు దాటినా వేడి తగ్గడంలేదు. సోమవారం కొనకనమిట్ల మండలం చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

Published : 24 May 2022 02:20 IST

చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీలు

ఎండ తీవ్రతకు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా

ఉన్న ఒంగోలులోని చర్చి కూడలి ప్రాంతం

ఒంగోలు గ్రామీణం, యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలు దాటినా వేడి తగ్గడంలేదు. సోమవారం కొనకనమిట్ల మండలం చిన్నారికట్లలో అత్యధికంగా 42.19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అధికం. దీనికి తోడు వడగాల్పులు మొదలయ్యాయి. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణం తలపించేలా నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

జన జీవనంపై ప్రభావం

సాధారణ ప్రజలతో పాటు వీధి వ్యాపారులు, పనులకు వెళ్లే కార్మికులు, వ్యవసాయ కూలీలు ఎండ తీవ్రతకు పని ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉపాధిహామీ కూలీలు పనిచేసే చోట వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల చొప్పున నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికితోడు పల్లెల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలుకు బజారుకు వచ్చినవారు ఉదయం 11 గంటకల్లా ముగించుకొని తిరుగుముఖం పడుతున్నారు. కొన్నిచోట్ల దుకాణాలు మధ్యాహ్నం 12 కే మూతపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి తెరుస్తున్నారు.

నిపుణుల సూచనలు ఇలా...

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు సాధ్యమైనంత వరకు బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు వస్త్రం చుట్టుకోవడంతోపాటు, ముఖం, నోరు పొడిబారితే వెంటనే నీడలోకి వెళ్లి ఏదైనా ద్రవ పదార్థం తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. నీటిని ఎక్కువగా తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు తీసుకోవాలి. వడగాలుల వల్ల ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించడం సరికాదు’ అని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన అధిక ఉష్ణోగ్రతలు ఇలా (సెల్సియస్‌ డిగ్రీల్లో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని