logo

శ్రేణులు పులకించేలా..!

ఒంగోలు మండలం మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు వేదిక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా వేదిక, షెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. త్రోవగుంట మేజర్‌

Published : 24 May 2022 02:20 IST

ప్రత్యేకత ఉట్టిపడేలా మహానాడు ఏర్పాట్లు

ఒంగోలు అంతటా అలంకరణ

మహానాడు ఏర్పాట్లు పరిశీలిస్తున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,

తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఎమ్మెల్యే

బాల వీరాంజనేయస్వామి, నాయకులు టీడీ జనార్దన్‌ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు మండలం మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు వేదిక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 85 ఎకరాల స్థలంలో సభా వేదిక, షెడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. త్రోవగుంట మేజర్‌ కాలువకు ఉత్తరం వైపున ఉన్న మరో 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌ నిమిత్తం ప్రణాళిక చేశారు. ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అక్కడ కేటాయించనున్నారు. అందుకు అవసరమయ్యేలా రోడ్డు నిర్మించనున్నారు.

అన్ని వీధుల్లో తోరణాలతో..

ఒంగోలు నగరంలోని అన్ని ప్రధాన వీధులను కటౌట్లు, ఫ్లెక్సీలు, పసుపు తోరణాలతో అలంకరించనున్నారు. ఇప్పటికే గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సుమారు రూ.కోటికి పైగా వ్యయం కానున్నట్లు అంచనా. మహానాడు ప్రాంగణంలో సభ ప్రారంభానికి ముందు, అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చనున్నారు. మండపేటకు చెందిన గుత్తేదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాంగణమంతా పసుపు రంగుతో కూడిన క్లాత్‌ కట్టేందుకు.. అలాగే ప్రభల ఏర్పాటుతోపాటు డ్రోన్లతో పూలు చల్లేందుకు యోచిస్తున్నారు.

పరిశీలించిన నేతలు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మలపాటి శ్రీధర్‌, బీఎన్‌ విజయకుమార్‌, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ ప్రొఫెషనల్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.తేజస్వి, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరెడ్డి, వై.వీ.సుబ్బారావు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. మంగళవారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, బుధవారం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మహానాడు ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఒంగోలు రానున్నారు.

పోలీసు శాఖ సహకరించాలి: ఎమ్మెల్యే స్వామి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మహానాడుకు పోలీసు శాఖ సహకరించాలని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి కోరారు. ఎస్పీ మలికా గార్గ్‌ను సోమవారం ఎమ్మెల్యే కలిశారు. ఈ కార్యక్రమాన్ని తెదేపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 28న లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. కీలక నాయకులు, భారీ జన సమీకరణ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు. హాజరయ్యే నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కొండపి నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా రౌడీషీట్లు తెరిచారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీల ఏర్పాటు

చదును చేసి షెడ్డు నిర్మాణ పనులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని