logo

కొండలను కొల్లగొట్టేశారు!

సహజ సిద్ధమైన ప్రకృతి సంపద చూస్తుండగానే మాయమవుతోంది. అధికార పార్టీ నేతల అక్రమాలకు యంత్రాంగం సైతం వంత పాడుతుండటంతో కొండలు కరిగిపోతున్నాయి. రూ.లక్షలాది విలువైన గ్రావెల్‌ నిత్యం తరలిపోతోంది. చివరకు పట్టా భూములను సైతం వదలడంలేదు.

Published : 24 May 2022 02:20 IST

అన్నంగి., బూరేపల్లిలో ఇష్టారీతిన గ్రావెల్‌ తవ్వకాలు

- ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

రెండు కొండల మధ్య తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం ఇదే..

సహజ సిద్ధమైన ప్రకృతి సంపద చూస్తుండగానే మాయమవుతోంది. అధికార పార్టీ నేతల అక్రమాలకు యంత్రాంగం సైతం వంత పాడుతుండటంతో కొండలు కరిగిపోతున్నాయి. రూ.లక్షలాది విలువైన గ్రావెల్‌ నిత్యం తరలిపోతోంది. చివరకు పట్టా భూములను సైతం వదలడంలేదు. లీజు ఒప్పందాలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. మద్దిపాడు మండలం అన్నంగి, బూరేపల్లి కొండ ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా చోటుచేసుకుంటున్న దందా ఇది.

ఒకవైపు సుందరమైన గుండ్లకమ్మ జలాశయం. మరోవైపు వందల ఎకరాల్లో విశాలమైన అన్నంగి, బూరేపల్లి కొండలు. మధ్యలో ఉన్న భూములు సైతం ఎర్రమట్టితో నిండి ఉంటాయి. కొండ ప్రాంతం కావడం, జనసంచారం తక్కువగా ఉండటం అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలో రోజూ జేసీబీలతో కొండలను తొలిచి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. పదుల సంఖ్యలో ఎర్రమట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.8 వేలకు, ట్రాక్టర్‌ మట్టిని రూ.3,500 చొప్పున వెంచర్లు, రహదారుల అవసరాల కోసం అమ్ముతున్నారు. కీలక ప్రజాప్రతినిధికి ప్రతీ ట్రిప్పు నుంచి నిర్దేశించిన మొత్తం కమీషన్‌గా అందుతుంది. (టిప్పర్‌కు రూ.2 వేలు) ఆయన సొంత వాహనాలకైతే అడ్డే ఉండదు. ఎర్రమట్టిని తీసుకెళ్లి విక్రయిస్తుంటాయి. జగనన్న కాలనీలకు సైతం మట్టిని తరలించి బిల్లులు చేసుకుంటుంటారు. అన్నంగి కొండ 60 నుంచి 100 ఎకరాల విస్తీర్ణం ఉండగా ప్రస్తుతం ఇది తన రూపురేఖలనే కోల్పోయింది. ఇక బూరేపల్లి ప్రాంతంలో తమ దందాకు సహకరించని రెవెన్యూ అధికారులను బదిలీ చేయించడం పరిపాటైంది. ఇప్పటికి వరుసగా ఏడుగురు అధికారులు మారారంటే ఊహించుకోవచ్ఛు గతంలో స్థానిక గ్రామాల ప్రజలు తమకు ఏదైనా అవసరమొస్తే కొంత మొత్తంలో ఉచితంగా తవ్వి తెచ్చుకునేవారు. మూడేళ్లుగా వారు సైతం టిప్పర్‌కు ఇంతని అక్రమార్కులకు చెల్లించాల్సి వస్తోంది. స్థానికుల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా అక్కడ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు.

పంట పొలం ఆక్రమించి..

ఇటీవల ‘స్పందన’లో జిల్లా పాలనాధికారికి బూరేపల్లి గ్రామానికి చెందిన కె.దేవదాసు అర్జీ ఇచ్చారు. ఎస్సీనైన తనకు 1992లో ప్రభుత్వం బూరేపల్లి కొండ వద్ద 2.92 సెంట్లు సాగుచేసుకోవడానికి ఇచ్చిందన్నారు. పండ్ల మొక్కలు నాటి తమ కుటుంబం ఆ పొలంపై ఆధారపడి బతుకుతుందన్నారు. కొందరు వైకాపా నాయకుల కన్ను పడి గతేడాది మైనింగ్‌ కోసం అడిగారని.. ఇవ్వనని తేల్చిచెప్పడంతో జేసీబీలు పెట్టి గ్రావెల్‌ తవ్వి తరలించారన్నారు. ప్రశ్నిస్తే దుర్భాషలాడి కొట్టారని పేర్కొన్నారు. ఎకరా స్థలంలో ఆరు అడుగుల లోతు తవ్వకానికి లీజుకని చెప్ఫి.రెండెకరాల్లో 15 అడుగుల లోతున తవ్వేశారన్నారు. అధికారులకు అర్జీ ఇచ్చి నెల దాటుతున్నా చర్యలు లేవన్నారు. స్థానికంగా మరో మహిళ సైతం తమ భూముల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

తవ్వకాలను అడ్డుకుంటున్నాం

అన్నంగి, బూరేపల్లి కొండ ప్రాంతాల్లో ఎర్రమట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు అందలేదు. అక్కడ ఎవరైనా ఇటువంటివాటికి పాల్పడుతున్నట్లు సమాచారం వస్తే సెబ్‌ అధికారులు, పోలీసులకు తెలియజేస్తున్నాం. వారు వెంటనే వెళ్లి అడ్డుకుని వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌, మద్దిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని