logo

ఆన్‌లైన్‌లో స్పందన విచారణ నివేదికలు

స్పందన అర్జీలను క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించి... విచారణ నివేదిక, ఫొటోగ్రాఫ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఆయా శాఖల అధికారులు కూడా రాండమ్‌గా అయిదు దరఖాస్తులను ఎంపిక చేసుకుని...

Published : 24 May 2022 02:20 IST

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: స్పందన అర్జీలను క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించి... విచారణ నివేదిక, ఫొటోగ్రాఫ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. ఆయా శాఖల అధికారులు కూడా రాండమ్‌గా అయిదు దరఖాస్తులను ఎంపిక చేసుకుని... కిందిస్థాయి సిబ్బంది వాటిని పరిష్కరించిన తీరును పరిశీలించాలని ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముందుగా ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో పులి శ్రీనివాసులు, ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం, ఎస్‌డీసీ గ్లోరియా పాల్గొన్నారు.

‘విద్యుత్తు పరివర్తకం తగిలి రెండు పాడి గేదెలు చనిపోయాయి. జీవనోపాధి కోల్పోయిన తనకు పరిహారం ఇప్పించాల’ని కంభం మండలం తురిమెళ్లకు చెందిన సుబ్బారాయుడు కోరారు.

1998లో ఇచ్చిన ఇళ్ల లేఅవుట్‌లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా లైన్‌ లేదు... అవసరమైన చర్యలు తీసుకోవాలని కనిగిరి బీసీ కాలనీకి చెందిన రామాంజనేయులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

సర్వే నం.66/3లో 1.90 ఎకరాల విస్తీర్ణాన్ని వేరొకరి పేరిట ఆన్‌లైన్‌ చేశారని పెద్దారవీడుకు చెందిన షేక్‌ నజీర్‌ అబ్దుల్‌ ఫిర్యాదు చేశారు. అదే మండలం దేవరాజుగట్టుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సయ్యద్‌ మహబూబ్‌ బాషా కూడా ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జేసీ అభిషిక్త్‌ కిషోర్‌ విచారణకు ఆదేశించారు.

పోలీసు శాఖకు 72 వినతులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 72 వినతిపత్రాలు అందాయి. ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు తెలియజేశారు. ఎస్పీ వారితో ముఖాముఖి మాట్లాడారు. చట్ట పరిధికి లోబడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అన్ని డీఎస్పీ, సీఐ కార్యాలయాలతో పాటు పోలీసు స్టేషన్లలోనూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని... ప్రజలు అక్కడ కూడా అర్జీలు అందజేయవచ్చని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని