logo

మహా సన్నద్ధం

తొలిసారిగా ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయడానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నాయకులు, నియోజకవర్గాల బాధ్యులు పూర్తి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతి నియోజకవర్గం నుంచి

Published : 25 May 2022 06:29 IST

 తెదేపా నేతల విస్తృత ఏర్పాట్లు
 ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా హాజరుకానున్న శ్రేణులు


ఏర్పాట్లపై చర్చిస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల, మాజీ మంత్రి దేవినేని,
నేతలు దామచర్ల జనార్దన్, గొట్టిపాటి, బాలాజీ, సత్య, ఉగ్ర, ఎరిక్షన్‌బాబు, విజయ్‌కుమార్‌

తొలిసారిగా ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయడానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నాయకులు, నియోజకవర్గాల బాధ్యులు పూర్తి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతి నియోజకవర్గం నుంచి 20 వేలు-25 వేల మంది హాజరయ్యేలా దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు జోరందుకున్నాయి.  - ఈనాడు డిజిటల్, ఒంగోలు

తెదేపా శ్రేణులకు ఏటా మే చివరివారంలో వచ్చే మహానాడు పెద్ద పండగ. ఈసారి జిల్లాకు అవకాశం రావడంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కొండపి, అద్దంకి, పర్చూరు, ఒంగోలు, కందుకూరు, వైపాలెం, చీరాల, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. బస్సులు, ప్రైవేటు వాహనాల కొరత, ఇతర రవాణా ఇబ్బందులు తలెత్తినా సరే ఒంగోలు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
సామాజిక మాధ్యమాల ద్వారానూ ఆహ్వానం..
27న జరగనున్న ప్రతినిధుల సభకు ముఖ్య నాయకులతో పాటు కొందరు వస్తారని, రెండోరోజు 28న బహిరంగ సభకు భారీగా హాజరుకావాలని నిర్ణయించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పోస్టులు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. మండల, నియోజకవర్గస్థాయి నాయకులు మాట్లాడుతూ.. ఈ మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయని, పార్టీ ఆవిర్భావానికి నలభై ఏళ్లు పూర్తవుతుందన్నారు. మూడేళ్ల వైకాపా పాలనపై ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై సైతం ఆసక్తి నెలకొందన్నారు. 
ఒంగోలు నుంచి అత్యధికంగా
మహానాడుకు ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 30 వేల మంది హాజరుకానున్నట్లు సమాచారం. కనిగిరి నియోజకవర్గం నుంచి 25 వేల మందికి పైగా కార్యకర్తలు వస్తారని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పర్చూరు, అద్దంకి, కొండపి, చీరాల, దర్శి, సంతనూతలపాడు, మార్కాపురం, కందుకూరు తదితర నియోజకవర్గాల నుంచి కూడా 20 వేలమందికి తక్కువ కాకుండా వస్తారని చెబుతున్నారు. 
సమష్ఠిగా కార్యాచరణ
మహానాడు ఏర్పాట్లను ఉమ్మడి ప్రకాశం నేతలంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేతలు దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, ఎమ్మెల్యే స్వామి, ఇతర నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతోపాటు అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇతర నాయకులు మహానాడు ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. రోజూ రాష్ట్రస్థాయి నాయకులు సైతం వస్తున్నారు.. బుధవారం సాయంత్రానికి అన్ని పనులు పూర్తిచేస్తామని నాయకులు చెబుతున్నారు. చాలా ఉత్సాహంగా, వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారంటూ జిల్లా నేతలకు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కితాబిచ్చారు. 

ప్రజలే స్వచ్ఛందంగా సొంత వాహనాలు పెట్టుకుని మరీ మహానాడుకు వస్తామని చెబుతున్నారు.. ప్రభుత్వంపై సామాన్యులు సైతం విసుగెత్తిపోయి ఉన్నారు. రాష్ట్రం నలువైపుల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి సైతం లక్షలాది మంది తెదేపా అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు.-ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. మహిళలకు రక్షణ కరవైంది. దళితులపై దాడులు అధికమయ్యాయి.  వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెదేపాకు పూర్వ వైభవం తీసుకురావాలి. -గిద్దలూరు నియోజకవర్గ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి


మహానాడు సభా ప్రాంగణం ముస్తాబు


అడ్డంకులు హేయమైన చర్య  
- వర్ల రామయ్య

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా మహానాడుకు ప్రైవేటు బస్సులను సైతం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం హేయమైన చర్య అని పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని... పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు జనంలోకి వెళ్తామంటే వైకాపా ప్రభుత్వానికి ఎందుకంత కంగారని ప్రశ్నించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడితోనే... చలానా కట్టించుకుని కూడా ఒంగోలులోని మినీ స్టేడియంను మహానాడు నిర్వహణకు ఇవ్వలేదన్నారు. పాఠశాల బస్సులు ఇవ్వొద్దని వాటి యాజమాన్యాలకు, ప్రైవేట్‌ బస్సులు ఇవ్వొద్దని ట్రావెల్స్‌ నిర్వాహకులకు రవాణాశాఖ అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తుండడం దారుణమన్నారు. అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. డ్రైవర్‌ రూ.20 వేలు అప్పు తీసుకుని గొడవ పడడంతో... కొట్టి చంపానని ఎమ్మెల్సీ అనంత్‌బాబు చెప్పడం వైకాపా పాలన ఎలా ఉందో చెబుతోందన్నారు. అలాంటి ఎమ్మెల్సీ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని