logo

అడుగడుగునా ప్రశ్నల వర్షం

మురుగు కాలువలు తీయించకుండా సీసీ రోడ్లు వేయడంతో వర్షం వచ్చిన ప్రతిసారి నీరంతా ఇళ్లలోకి వస్తోందని పట్టణంలోని బీసీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ప్రశ్నించారు. బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కాలనీకి

Published : 26 May 2022 06:47 IST


ఛైర్మన్‌ అబ్దుల్‌ గఫార్, సీపీఎం నాయకుడు కొండారెడ్డి మధ్య వాగ్వాదం

కనిగిరి, న్యూస్‌టుడే: మురుగు కాలువలు తీయించకుండా సీసీ రోడ్లు వేయడంతో వర్షం వచ్చిన ప్రతిసారి నీరంతా ఇళ్లలోకి వస్తోందని పట్టణంలోని బీసీ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను ప్రశ్నించారు. బుధవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కాలనీకి చెందిన బత్తుల కోటమ్మ, భాగ్యలక్ష్మి తదితర మహిళలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పింఛనును ఇప్పుడు అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటేశ్వరమ్మ అనే మహిళ మాట్లాడుతూ నివేశన స్థలానికి ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. 
ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆగ్రహం... 
బీసీ కాలనీలో అడుగడుగునా ఆక్రమణలు ఉన్నాయని... అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పడి రోడ్లు, మురుగు కాలువలు సైతం ఆక్రమించి రాకపోకలు సాగించేందుకు వీలులేకుండా చేశారన్నారు. వారం రోజుల్లో ఆక్రమణలు తొలగించి, సీసీ రోడ్లు, పక్క కాలువలు నిర్మించాలని టీపీవో వివేకానందను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బాధ్యతతో పని చేయాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు. 
ఛైర్మన్, సీపీఎం నాయకుడి మధ్య వాగ్వాదం 
‘గడప గడప మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సమక్షంలో ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్, సీపీఎం నాయకుడు ఎం.కొండారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కాలువల్లో మురుగు తీయడం లేదని, ఆక్రమణలు జరిగిని సచివాలయ ఉద్యోగులు,  వాలంటీర్లు పట్టించుకోవడం లేదని ఛైర్మన్‌ను ప్రశ్నించారు. అందుకు ఛైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పైసా రాకున్నా సొంత నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరిస్తున్నామని ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ సరితారెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, సింగిల్‌విండో అధ్యక్షుడు ఎస్‌.మోహన్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్లు ఆర్‌.మాణిక్యరావు, పులి శాంతి తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని