logo

అగ్గిరాజుకుంటే ఇక అంతే

గత ఏడాది మార్కాపురం పట్టణంలోని బోడపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో వేరుశనగ పప్పుమిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సమాచారం తెలిసి అగ్నిమాపక శకటం వెళ్లింది. తమ వద్ద ఉన్న నీటితో

Published : 26 May 2022 06:52 IST

పశ్చిమంలోని కేంద్రాల్లో అన్నీ అవస్థలే

నీటితోపాటు సిబ్బంది కొరత

మార్కాపురం అగ్నిమాపక కేంద్రం

గత ఏడాది మార్కాపురం పట్టణంలోని బోడపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో వేరుశనగ పప్పుమిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సమాచారం తెలిసి అగ్నిమాపక శకటం వెళ్లింది. తమ వద్ద ఉన్న నీటితో మంటలు ఆర్పింది. తర్వాత జలం కోసం అన్వేషించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మార్కాపురం సాయిబాలాజీ థియేటర్‌కు సమీపంలోని పలకల పరిశ్రమలో పదిరోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగి రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక వాహనాలు అతి కష్టంపై చేరుకొని మంటలు అదుపులోకి తేగలిగాయి.

మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో ఈనెల 17న ప్రమాదం జరిగి కారులోనే ముగ్గురు యువకులు సజీవదహనమయ్యారు. కంభం నుంచి అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకునేసరికి సుదీర్ఘ సమయం పట్టింది.

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో అగ్ని ప్రమాదం జరిగితే బుగ్గిపాలే అన్నట్లుగా మారింది. మంటలను అదుపు చేయడానికి అవసరమైన నీరు కేంద్రాల్లో అందుబాటులో ఉండటం లేదు. ఒక్క డీప్‌ బోరు కూడా పనిచేయడం లేదు. కొన్ని కేంద్రాల్లో అసలు బోర్లే లేవు. మరికొన్ని కేంద్రాల పరిధి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్లేందుకు చాలా ఆలస్యమవుతోంది. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, దోర్నాల, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక్కోదాని పరిధిలో సగటున 45 కిలోమీటర్ల దూరం ఉంది. బయట బోర్ల వద్ద, శుద్ధజల కేంద్రాల వద్ద వృథాగా పోయే నీటిని పట్టుకొని ఈ వాహనాలు చేరుకోవాల్సి వస్తోంది. ఎక్కడా సిబ్బంది ఉండేందుకు గదులు లేవు. మార్కాపురంలో దాతలు, సిబ్బంది చందాలు వేసుకొని ఒక గదిని నిర్మాణం చేశారు.

ఇదీ పరిస్థితి

మార్కాపురం అగ్నిమాపక కేంద్రంలో నీటిని పట్టుకోవడానికి డీప్‌ బోరు పనిచేయడంలేదు. సంపు కూడా నిరుపయోగంగా ఉంది. వాహనంలో ఉన్న 4500 లీటర్లు పూర్తయిన తర్వాత మళ్లీ నింపాలంటే ఎవరినైనా అడగాల్సిందే. ఒక పోస్టు ఖాళీగా ఉంది.

కంభం అగ్నిమాపకశాఖ కేంద్రంలో నీటి సమస్య వేధిస్తోంది. డీప్‌ బోరు కూడా లేదు. ప్రమాదాలు జరిగిపప్పుడు నీటిని బయట ఎవరి వద్దనైనా అడిగి నింపుకొని వెళ్తున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు సహకారంతో నూతన బోరు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

గిద్దలూరు కేంద్రంలోనూ నీటి సమస్యే. బయట సాగర్‌ పైపులైన్‌ ద్వారా ట్యాంకులో నీటిని నిల్వ చేసుకున్న తర్వాత వాహనంలోకి నింపి తీసుకెళ్తున్నారు. యర్రగొండపాలెంలోనూ అదే పరిస్థితి. బోరును రెండు రోజుల్లో నిర్మాణం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నీటిని ప్రస్తుతం బయటే పట్టుకుంటున్నారు.

మార్కాపురం డివిజన్‌ పరిధిలో ఉన్న అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది ఉండటానికి గదులు లేవు. మార్కాపురంలో అయితే దాతలు, సిబ్బంది చందాలు వేసుకొని ఒక గదిని నిర్మాణం చేపట్టారు. మిగిలిన అన్ని చోట్లా సిబ్బందికి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు.

సమస్య పరిష్కారానికి చర్యలు

మార్కాపురం డివిజన్‌లోని అగ్నిమాపకశాఖ కేంద్రాల్లో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే. బయట పొలాల్లో బోర్ల వద్ద, సమీపంలోనూ పట్టుకుంటున్నారు. ఇబ్బందులపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాం.. తక్షణమే బోర్లు తవ్వేందుకు, సంపుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. - వేణుగోపాలరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, ఒంగోలు

నిరుపయోగంగా ఉన్న సంపు.. డీప్‌ బోరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని