logo

రూ.500 కోసం వివాదం

నగదు విషయంపై జరిగిన వివాదం చివరకు పెద్దమనిషిగా వచ్చిన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన పుల్లలచెరువు మండలకేంద్రంలోని ఎస్సీపాలెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈ ప్రాంతంలో ఓ చర్చి వేడుక జరుగుతోంది.

Published : 26 May 2022 06:52 IST

గొడవపై సర్దిచెప్పిన పెద్దమనుషులపై కత్తితో దాడి

ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

ఆసుపత్రి వద్ద రోదిస్తున్న మృతుని భార్య గాలెమ్మ

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: నగదు విషయంపై జరిగిన వివాదం చివరకు పెద్దమనిషిగా వచ్చిన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటన పుల్లలచెరువు మండలకేంద్రంలోని ఎస్సీపాలెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఈ ప్రాంతంలో ఓ చర్చి వేడుక జరుగుతోంది. కాలనీకి చెందిన బడిపాటి నవీన్‌ మద్యం మత్తులో గ్లాడ్‌సన్‌ అనే వ్యక్తి వద్దకు వెళ్లి చరవాణి కావాలని.. మాట్లాడి ఇస్తానని చెప్పాడు. వెంటనే గ్లాడ్‌సన్‌ ఇచ్చారు. తిరిగి ఇచ్చిన క్రమంలో చరవాణి కవర్‌లో తాను భద్రపరిచిన రూ.500 నోటు కనిపించకపోవడంతో నవీన్‌ను గ్లాడ్‌సన్‌ ప్రశ్నించారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం గ్లాడ్‌సన్‌ విషయాన్ని భార్య సలోమికి చెప్పారు. సలోమీ నవీన్‌ వద్దకు వెళ్లి తన భర్తకు చెందిన డబ్బులు తీసుకున్నావా అని నిలదీశారు. అనంతరం నవీన్‌ ఆమె ఇంటికి వెళ్లి కర్రతో కొట్టడంతో విషయాన్ని ఆమె తన బంధువుల దృష్టికి తీసుకెళ్లారు. బంధువులు రావూరి ఆశీర్వాదం(35) ఆనందరావులు వచ్చి మహిళను కొట్టడం భావ్యం కాదని.. ఏదైనా సమస్య ఉంటే పెద్దమనుషులతో చెప్పాలని నవీన్‌కు హితవు పలికారు. దీంతో నవీన్‌ ఆగ్రహించి కత్తితో వారిద్దరిపై దాడిచేశాడు. గాయపడిన వారిద్దరినీ స్థానికులు యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆశీర్వాదం మృతిచెందారు. ఆనందరావును గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఆశీర్వాదంకు భార్య గాలెమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ కుటుంబానికి ఆధారమేదంటూ గాలెమ్మ రోదించారు. కాగా ఆశీర్వాదం స్వస్థలం యర్రగొండపాలెం మండలం అమని గుడిపాడు. వేడుక సందర్భంగా పుల్లల చెరువు వచ్చి అనూహ్యంగా జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేముల సుధాకర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని