Atchannaidu: ఆ మంత్రుల్లో ఒక్కరికైనా నోరుందా?: అచ్చెన్నాయుడు

ఒంగోలులో మహానాడు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని.. రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 26 May 2022 13:03 IST

ఒంగోలు: మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మహానాడుకు పేరు రాకూడదని వైకాపా బస్సు యాత్ర చేపట్టింది. వైకాపా ప్రభుత్వం మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం చేశామని చెబుతోంది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే బలహీన వర్గాలకు చెందిన 10 మందికి మంత్రి పదవులిచ్చారు. 2014లో తెదేపా హయాంలో 103 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 9మంది బలహీనవర్గాల వారికి మంత్రి పదవులు ఇచ్చాం. దీన్ని బట్టి సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదో మీరే చెప్పాలి? మీరు మంత్రి పదవి ఇచ్చిన 10 మందిలో ఎవరికైనా నోరుందా? బలహీనవర్గాల బాధలు గానీ.. వారి కష్టాలు గానీ సీఎం దగ్గర చెప్పే ధైర్యం ఏ మంత్రికైనా ఉందా?

మూడేళ్లలో బీసీలకు ఒక్క మంచి పనైనా చేశారా?

రాష్ట్రాన్ని నలుగురు సొంత వ్యక్తులకు రాసిపెట్టి.. బలహీన వర్గాలకు మంత్రి పదవులిచ్చామని గొప్పలు చెబుతున్నారు. బలహీన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారా? ఇవాళే శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. బస్సులో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులను ఒకటే అడుగుతున్నా. వైకాపా ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో బీసీలకు ఏదైనా మంచి పని చేశారా? తెదేపా పెట్టిన పథకాలను రద్దు చేశారు. మా హయాంలో కులవృత్తుల వారికి పరికరాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాం. ఆ పరికరాలన్నీ జిల్లాల గొడౌన్లలో ఉన్నాయి. పైసా ఖర్చు లేకుండా వాటిని బీసీలకు పంచి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి.. బీసీలకు సామాజిక న్యాయం అంటున్నారు.

మా పథకాలు ఎందుకు రద్దు చేశారు?

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకున్న పేదల పిల్లలకు రూ.10 లక్షలు ఇచ్చి చదివించాం. బీసీల పిల్లలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ కోచింగ్‌ తీసుకోవాలంటే వారికి నచ్చిన చోట అకాడమీల్లో కోచింగ్‌ ఇప్పించాం. ఆ పథకాన్ని ఎందుకు తీసేశారు? బీసీ పిల్లలకు పెళ్లి కానుక ఇచ్చేవాళ్లం. జగన్‌ ఆ పథకానికి రూ. లక్ష ఇస్తా అని హామీ ఇచ్చి.. మూడేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. అన్న క్యాంటీన్లు ఎక్కువగా బలహీన వర్గాలకు ఉపయోగపడ్డాయి. వాటిని ఎందుకు రద్దు చేశారు? చంద్రన్న బీమాలో కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు.

ఏపీలోని బీసీలకు రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా?

కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి అయినా వాటికి కేటాయించారా? కొత్త పథకాలు తీసుకురాకపోగా.. మా పథకాలను రద్దు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుల్లో బీసీలకు పెద్దపీట వేశామంటున్నారు. మీ పార్టీకి ఉన్న ఎనిమిది మందిలో సభ్యుల్లో ముగ్గురు మీతో పాటు అవినీతి కేసులో ఉన్న ముద్దాయిలు. ముగ్గురు ముద్దాయిల తరఫున వాదించిన లాయర్‌కు ఓ రాజ్యసభ ఇచ్చారు. ఒక బీసీని తెలంగాణ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఏపీలో బీసీలు లేరా? ఇక్కడ ఉన్న బీసీలకు రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా? రాయలసీమలో ఒక్కరికైనా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారా?’’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని