TDP Mahanadu: మంత్రుల బస్సు యాత్రలో వస్తోంది ‘అలీబాబా 40 మంది దొంగలు’: అచ్చెన్నాయుడు

రానున్న ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని..

Updated : 27 May 2022 14:15 IST

ఒంగోలు: రానున్న ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని.. 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయంలో తెదేపా కార్యకర్తలపై గురుతర బాధ్యత ఉందన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఈ మూడేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. బలహీనవర్గాల్లో 80 శాతం మంది తెదేపాతో ఉన్నట్లు సీఎంకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ఉండటంతోనే వైకాపా మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని చెప్పారు.

ఆ బస్సుయాత్రలో వస్తోంది అలీబాబా 40 మంది దొంగలని అచ్చెన్న వ్యాఖ్యానించారు. మూడేళ్లలో ఏం చేశారని బస్సుయాత్రలో మంత్రులను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అందజేస్తున్న పథకాలను ఎత్తేశారని.. వాటన్నింటిపైనా నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ తెదేపా అన్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చిందని చెప్పారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. చంద్రబాబు సీఎం అయ్యాక ఒకే ఒక్క సంతకంతో ఆ కేసులన్నీ తీసేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని.. తెలుగుదేశం పార్టీని జగన్‌ ఏమీ చేయలేరని అచ్చెన్నాయుడు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని