Dhulipalla: ఏపీలో ఒక్కో రైతుకు రూ.2.74లక్షల అప్పు: ధూళిపాళ్ల నరేంద్ర

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు.

Published : 27 May 2022 15:08 IST

ఒంగోలు: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా మహానాడులో ‘కష్టాల కడలిలో సేద్యం.. దగా పడుతున్న రైతన్న’ తీర్మానాన్ని ధూళిపాళ్ల ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా అప్పుల భారం కలిగిన రైతులు ఏపీలోనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని చెప్పారు.

రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?

ఏపీలో సగటున ఒక్కో రైతుపై రూ.2.74లక్షల అప్పు ఉందని ధూళిపాళ్ల చెప్పారు. వైకాపా ప్రభుత్వం చెప్పిన రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో 45లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటే 15లక్షల ఎకరాలకే బీమా ఇచ్చారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పెట్రోల్‌ ధరల భారం కారణంగా రైతులపై తీవ్రమైన భారం పడుతోందన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే లాభమంటూ మంత్రులు వితండ వాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే వారి జీవితాలు ఎందుకు బాగుపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా హయాంలో రైతులకు ఉన్న పథకాలన్నీ ఆగిపోయాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని